మసాలా.. గరమ్‌ గరమ్‌! | Competition of Masala companies | Sakshi
Sakshi News home page

మసాలా.. గరమ్‌ గరమ్‌!

Published Sat, Apr 15 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

మసాలా.. గరమ్‌ గరమ్‌!

మసాలా.. గరమ్‌ గరమ్‌!

► 250కిపైగా రకాలతో కంపెనీల పోటీ
► వ్యవస్థీకృత రంగంలో 3,500 బ్రాండ్లు
► మార్కెట్‌ వార్షిక విలువ  రూ.1,60,000 కోట్లు
►  ప్రపంచ దేశాలకు  ఇక్కడి నుంచే ఎగుమతి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, సాజీర, ఆవాలు, మెంతులు... సాధారణంగా అయితే ప్రతి ఇంట్లో పోపు డబ్బాలో ఉండేవి ఇవే. భోజన ప్రియులైతే ఈ జాబితా ఇంకాస్త పెద్దగా ఉంటుంది. అంతే!!
ఇలా అనుకుంటే మీరు పోపులో కాలేసినట్లే. ఎందుకంటే దేశంలో దాదాపు 250కిపైగా మసాలా పొడులు, మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి మరి. అంతేకాదు!! వీటి మార్కెట్‌ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి లక్షా అరవైవేల కోట్ల రూపాయలు!! అదీ కథ.

ఒక ప్రాంతంలో ఉండే వంటకాలు మరో ప్రాంతానికి వెళ్లే సరికి మారిపోతున్నాయి. ప్రాంతాలనుబట్టి ఆహారపుటలవాట్లు మారుతుండడంతో మార్కెట్లో కొత్తకొత్త మసాలా పొడులు కొలువుదీరుతున్నాయి. వినియోగదార్ల ఆదాయాల పెరుగుదల, కొత్త వంటకాలను ఆస్వాదించాలన్న తపన వెరశి కంపెనీలకు కొత్త సవాల్‌ విసురుతున్నాయి. అందుకే మసాలా మార్కెట్‌ రూ.1,60,000 కోట్లు దాటేసింది. ఇక హోమ్‌ మేడ్‌ పొడులు, మిశ్రమాలు వీటికి అదనం.

టాప్‌లో చికెన్‌ మసాలా..
మసాలా మిశ్రమాల్లో టాప్‌లో నిలుస్తున్నది చికెన్‌ మసాలానే. ఆ తర్వాతి స్థానాల్లో సాంబార్‌ పొడి, గరమ్‌ మసాలా, మటన్‌ మసాలా, రసమ్‌ పొడి వంటివి ఉన్నాయని ఎంటీఆర్‌ ఫుడ్స్‌ సీఈవో సంజయ్‌ శర్మ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో వెజ్‌ రకాల వాటా 63 శాతమని చెప్పారాయన.

పరిశ్రమలో మిశ్రమాల వాటా 20 శాతంగా ఉంది. ఈ రంగంలో 250పైగా రకాల ముడి పదార్థాలను వాడుతున్నారు. వీటిలో 10 శాతం దాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కావటం గమనార్హం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 1,000 రకాలకు పైగా వంటకాలను ఆస్వాదిస్తున్నారట. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 50 వేలకుపైగానే వంటకాలు ఉంటాయని సమాచారం. ఈ స్థాయిలో టాప్‌ వంటకాలకు తగ్గట్టుగా మసాలా మిశ్రమాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి.

ప్రాంతాలకే బ్రాండ్ల పరిమితం..
మసాలా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులువేం కాదు. వేలాది బ్రాండ్లు ఒకవైపు పోటీపడుతున్నాయి. మరోవైపు ప్రాంతాన్ని బట్టి కస్టమర్ల అభిరుచులు వేరుగా ఉంటున్నాయి. తెలంగాణ, రాయలసీమలో సాంబార్‌ ఘాటుగా తింటారు. అదే కర్నాటక వాసులు కారం తక్కువగా తింటారని సూర్య బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ రవీంద్ర మోదీ చెప్పారు.

‘మరో ప్రాంతానికి విస్తరించాలంటే అక్కడి మార్కెట్‌కు తగ్గ ఉత్పత్తులు తయారు చేయాలి. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితేనే అక్కడ అడుగుపెట్టగలం. ఇది వ్యయంతో కూడుకున్నది. ఒక బ్రాండ్‌ వాడేవారు మరో బ్రాండ్‌కు మళ్లాలంటే సులువు కాదు. అందుకే చాలా బ్రాండ్లు ఒక ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి’ అని అన్నారు.

పరిశోధిస్తేనే విజయం...
మిశ్రమాల విషయంలో ఒక్కో ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు ఎంతో పరిశోధన చేయాలి. కస్టమర్ల అభిరుచిని తెలుసుకోవాలి. ఉత్పాదన అభివృద్ధిలో భాగంగా వందలాది మంది వినియోగదార్లకు రుచి చూపించాలి. పరీక్ష పాస్‌ అయితేనే ఉత్పాదన బయటకు వస్తుంది. ఒక్కో వెరైటీకి 7 నెలల వరకూ సమయం పడుతుందని సంజయ్‌ శర్మ తెలిపారు. పోటీలో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి పరిశోధన తప్పదని రవీంద్ర మోదీ చెప్పారు. ప్రాంతాలకు అనుగుణంగా రుచులను అందించాల్సిందేనన్నారు. ఇందుకు దినుసుల నాణ్యతలో రాజీ పడకూడదని, ఒక ఉత్పాదన రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

మార్కెట్లో వేల బ్రాండ్లు..
భారత్‌లో మసాలా పొడులు, మిశ్రమాల వ్యాపారంలో వ్యవస్థీకృత రంగంలో దాదాపు 3,500 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అవ్యవస్థీకృత రంగంలో అంటే స్థానికంగా చిన్నా చితకా బ్రాండ్లæ సంఖ్య దీనికి అయిదు రెట్లు ఉంటుంది. 250కి పైగా రకాల రుచుల్లో ఇవి లభిస్తున్నాయి.

8 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తున్న రూ.1,60,000 కోట్ల విపణిలో బ్రాండెడ్‌ కంపెనీల వాటా రూ.27,000 కోట్లుంది. బ్రాండెడ్‌ కంపెనీల వ్యాపారంలో సగం వరకూ ఎగుమతుల ద్వారా వస్తున్నదే. ప్రపంచంలోని పలు దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో రుచులను తయారు చేస్తున్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని కంపెనీలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement