సాక్షి, హైదరాబాద్: సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు.
కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఘాటెక్కి.. హీటెక్కి..
కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి.
వామ్మో.. వెల్లుల్లి..
♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
♦ గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్‌లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
రైస్.. రైజ్..
గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్‌కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు.
కూర‘గాయాలే’..
నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్ మార్కెట్‌లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రధానంగా బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్‌బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment