MTR Foods
-
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాలపై ఎంటీఆర్ మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల సంస్థ ఎంటీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో సునయ్ భాసిన్ తెలిపారు. ఓక్లా ఇండియాలో భాగమైన తమ సంస్థ గత మూడేళ్ల వ్యవధిలో గుంటూరులోని ప్లాంటు, ఇతరత్రా అప్‌గ్రేడేషన్ మొదలైన వాటిపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో లైన్‌పై రూ. 30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.5 లక్షల అవుట్‌లెట్స్ ఉన్నాయని, గత అయిదేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపయ్యాయని భాసిన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ సంస్థకు రెండో అతి పెద్ద మార్కెట్ అని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. మూడు విభాగాలతో కలిపి ఓక్లా ఇండియా టర్నోవరు రూ. 2,300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. -
ఎంటీఆర్ ఫుడ్స్ చేతికి ఈస్టర్న్ బ్రాండ్
ఈస్టర్న్ బ్రాండుతో మసాలా పౌడర్లు, పచ్చళ్లు తయారు చేసే ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను ఎంటీఆర్ ఫుడ్స్ సొంతం చేసుకోనుంది. ఇందుకు అనుబంధ సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నార్వేజియన్ దిగ్గజం ఓక్లా తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో 67.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా మసాలా పౌడర్లు, ప్రొడక్టుల అమ్మకాలను రెట్టింపునకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ఎంటీఆర్ ఫుడ్స్ మాతృ సంస్థ ఓక్లా తెలియజేసింది. విలీనం ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ కాండిమెంట్స్ ప్రమోటర్లు మీరన్ కుటుంబం నుంచి 41.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇదే విధంగా మెక్‌కార్నిక్ ఇన్గ్రెడియంట్స్కు చెందిన 26 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. మెజారిటీ వాటా కొనుగోలు తదుపరి ఎంటీఆర్ ఫుడ్స్‌లో ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను విలీనం చేయనున్నట్లు ఓక్లా తెలియజేసింది. డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించవలసి ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీల వివరాలు ఎంటీఆర్ ఫుడ్స్‌ను నార్వేజియన్ దిగ్గజం ఓక్లా 2007లో సొంతం చేసుకుంది. తద్వారా మసాలా పౌడర్లు తదితర ప్రొడక్టుల ద్వారా దేశవ్యాప్తంగా బిజినెస్‌ను విస్తరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 920 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇక కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను 1983లో ఎంఈ మీరన్ ఏర్పాటు చేశారు. జూన్ చివరికల్లా 12 నెలల కాలంలో రూ. 900 కోట్ల అమ్మకాలు సాధించింది. దీనిలో సగ భాగం కేరళ నుంచే లభిస్తుండటం గమనార్హం! ఈస్టర్న్ కాండిమెంట్స్ నాన్‌వెజ్, వెజిటేరియన్ ఫుడ్ ప్రొడక్టులను రూపొందిస్తుంటే.. ఎంటీఆర్ వెజిటేరియన్ ఉత్పత్తులకే పరిమితమైంది. డీల్ తదుపరి ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో మీరన్ కుటుంబానికి 26 శాతం వాటా మిగలనుంది. అయితే విలీనం తదుపరి సంయుక్త సంస్థలో ఈ వాటా 9.99 శాతానికి చేరనున్నట్లు తెలుస్తోంది. -
మసాలా.. గరమ్ గరమ్!
► 250కిపైగా రకాలతో కంపెనీల పోటీ ► వ్యవస్థీకృత రంగంలో 3,500 బ్రాండ్లు ► మార్కెట్ వార్షిక విలువ రూ.1,60,000 కోట్లు ► ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, సాజీర, ఆవాలు, మెంతులు... సాధారణంగా అయితే ప్రతి ఇంట్లో పోపు డబ్బాలో ఉండేవి ఇవే. భోజన ప్రియులైతే ఈ జాబితా ఇంకాస్త పెద్దగా ఉంటుంది. అంతే!! ఇలా అనుకుంటే మీరు పోపులో కాలేసినట్లే. ఎందుకంటే దేశంలో దాదాపు 250కిపైగా మసాలా పొడులు, మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి మరి. అంతేకాదు!! వీటి మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి లక్షా అరవైవేల కోట్ల రూపాయలు!! అదీ కథ. ఒక ప్రాంతంలో ఉండే వంటకాలు మరో ప్రాంతానికి వెళ్లే సరికి మారిపోతున్నాయి. ప్రాంతాలనుబట్టి ఆహారపుటలవాట్లు మారుతుండడంతో మార్కెట్లో కొత్తకొత్త మసాలా పొడులు కొలువుదీరుతున్నాయి. వినియోగదార్ల ఆదాయాల పెరుగుదల, కొత్త వంటకాలను ఆస్వాదించాలన్న తపన వెరశి కంపెనీలకు కొత్త సవాల్ విసురుతున్నాయి. అందుకే మసాలా మార్కెట్ రూ.1,60,000 కోట్లు దాటేసింది. ఇక హోమ్ మేడ్ పొడులు, మిశ్రమాలు వీటికి అదనం. టాప్‌లో చికెన్ మసాలా.. మసాలా మిశ్రమాల్లో టాప్‌లో నిలుస్తున్నది చికెన్ మసాలానే. ఆ తర్వాతి స్థానాల్లో సాంబార్ పొడి, గరమ్ మసాలా, మటన్ మసాలా, రసమ్ పొడి వంటివి ఉన్నాయని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో వెజ్ రకాల వాటా 63 శాతమని చెప్పారాయన. పరిశ్రమలో మిశ్రమాల వాటా 20 శాతంగా ఉంది. ఈ రంగంలో 250పైగా రకాల ముడి పదార్థాలను వాడుతున్నారు. వీటిలో 10 శాతం దాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కావటం గమనార్హం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 1,000 రకాలకు పైగా వంటకాలను ఆస్వాదిస్తున్నారట. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 50 వేలకుపైగానే వంటకాలు ఉంటాయని సమాచారం. ఈ స్థాయిలో టాప్ వంటకాలకు తగ్గట్టుగా మసాలా మిశ్రమాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రాంతాలకే బ్రాండ్ల పరిమితం.. మసాలా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులువేం కాదు. వేలాది బ్రాండ్లు ఒకవైపు పోటీపడుతున్నాయి. మరోవైపు ప్రాంతాన్ని బట్టి కస్టమర్ల అభిరుచులు వేరుగా ఉంటున్నాయి. తెలంగాణ, రాయలసీమలో సాంబార్ ఘాటుగా తింటారు. అదే కర్నాటక వాసులు కారం తక్కువగా తింటారని సూర్య బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ చెప్పారు. ‘మరో ప్రాంతానికి విస్తరించాలంటే అక్కడి మార్కెట్‌కు తగ్గ ఉత్పత్తులు తయారు చేయాలి. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితేనే అక్కడ అడుగుపెట్టగలం. ఇది వ్యయంతో కూడుకున్నది. ఒక బ్రాండ్ వాడేవారు మరో బ్రాండ్‌కు మళ్లాలంటే సులువు కాదు. అందుకే చాలా బ్రాండ్లు ఒక ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి’ అని అన్నారు. పరిశోధిస్తేనే విజయం... మిశ్రమాల విషయంలో ఒక్కో ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు ఎంతో పరిశోధన చేయాలి. కస్టమర్ల అభిరుచిని తెలుసుకోవాలి. ఉత్పాదన అభివృద్ధిలో భాగంగా వందలాది మంది వినియోగదార్లకు రుచి చూపించాలి. పరీక్ష పాస్ అయితేనే ఉత్పాదన బయటకు వస్తుంది. ఒక్కో వెరైటీకి 7 నెలల వరకూ సమయం పడుతుందని సంజయ్ శర్మ తెలిపారు. పోటీలో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి పరిశోధన తప్పదని రవీంద్ర మోదీ చెప్పారు. ప్రాంతాలకు అనుగుణంగా రుచులను అందించాల్సిందేనన్నారు. ఇందుకు దినుసుల నాణ్యతలో రాజీ పడకూడదని, ఒక ఉత్పాదన రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. మార్కెట్లో వేల బ్రాండ్లు.. భారత్‌లో మసాలా పొడులు, మిశ్రమాల వ్యాపారంలో వ్యవస్థీకృత రంగంలో దాదాపు 3,500 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అవ్యవస్థీకృత రంగంలో అంటే స్థానికంగా చిన్నా చితకా బ్రాండ్లæ సంఖ్య దీనికి అయిదు రెట్లు ఉంటుంది. 250కి పైగా రకాల రుచుల్లో ఇవి లభిస్తున్నాయి. 8 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తున్న రూ.1,60,000 కోట్ల విపణిలో బ్రాండెడ్ కంపెనీల వాటా రూ.27,000 కోట్లుంది. బ్రాండెడ్ కంపెనీల వ్యాపారంలో సగం వరకూ ఎగుమతుల ద్వారా వస్తున్నదే. ప్రపంచంలోని పలు దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో రుచులను తయారు చేస్తున్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని కంపెనీలు చెబుతున్నాయి.