ఈస్టర్న్ బ్రాండుతో మసాలా పౌడర్లు, పచ్చళ్లు తయారు చేసే ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను ఎంటీఆర్ ఫుడ్స్ సొంతం చేసుకోనుంది. ఇందుకు అనుబంధ సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నార్వేజియన్ దిగ్గజం ఓక్లా తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో 67.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా మసాలా పౌడర్లు, ప్రొడక్టుల అమ్మకాలను రెట్టింపునకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ఎంటీఆర్ ఫుడ్స్ మాతృ సంస్థ ఓక్లా తెలియజేసింది.
విలీనం
ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ కాండిమెంట్స్ ప్రమోటర్లు మీరన్ కుటుంబం నుంచి 41.8 శాతం వాటాను ఓక్లా కొనుగోలు చేయనుంది. ఇదే విధంగా మెక్‌కార్నిక్ ఇన్‌గ్రెడియంట్స్‌కు చెందిన 26 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. మెజారిటీ వాటా కొనుగోలు తదుపరి ఎంటీఆర్ ఫుడ్స్‌లో ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను విలీనం చేయనున్నట్లు ఓక్లా తెలియజేసింది. డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించవలసి ఉన్నట్లు వెల్లడించింది.
కంపెనీల వివరాలు
ఎంటీఆర్ ఫుడ్స్‌ను నార్వేజియన్ దిగ్గజం ఓక్లా 2007లో సొంతం చేసుకుంది. తద్వారా మసాలా పౌడర్లు తదితర ప్రొడక్టుల ద్వారా దేశవ్యాప్తంగా బిజినెస్‌ను విస్తరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 920 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇక కేరళకు చెందిన ఈస్టర్న్ కాండిమెంట్స్‌ను 1983లో ఎంఈ మీరన్ ఏర్పాటు చేశారు. జూన్ చివరికల్లా 12 నెలల కాలంలో రూ. 900 కోట్ల అమ్మకాలు సాధించింది. దీనిలో సగ భాగం కేరళ నుంచే లభిస్తుండటం గమనార్హం! ఈస్టర్న్ కాండిమెంట్స్ నాన్‌వెజ్, వెజిటేరియన్ ఫుడ్ ప్రొడక్టులను రూపొందిస్తుంటే.. ఎంటీఆర్ వెజిటేరియన్ ఉత్పత్తులకే పరిమితమైంది. డీల్ తదుపరి ఈస్టర్న్ కాండిమెంట్స్‌లో మీరన్ కుటుంబానికి 26 శాతం వాటా మిగలనుంది. అయితే విలీనం తదుపరి సంయుక్త సంస్థలో ఈ వాటా 9.99 శాతానికి చేరనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment