సాక్షి, న్యూఢిల్లీ : పండుగ వేళ ప్రజలకు ఉపశమనంలా ద్రవ్యోల్బణం దిగివచ్చిందనే గణాంకాలు వెల్లడయ్యాయి. గత నెల డిసెంబర్‌లో వినియోగదారుల సూచీ ద్రవ్యోల్బణం కనిష్టస్ధాయిలో 2.19 శాతానికి తగ్గిందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 2017 జూన్‌లో ద్రవ్యోల్బణం అత్యంత కనిష్టస్ధాయిలో 1.49 శాతంగా నమోదైన క్రమంలో ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం మళ్లీ తగ్గుముఖం పట్టింది.
ఆర్థిక నిపుణుల అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్‌లో వినిమయ ద్రవ్యోల్బణం దిగివచ్చిందని చెబుతున్నారు. ఇక డిసెంబర్‌లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్టస్ధాయిలో 3.80 శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, కొన్ని ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గత ఏడాది నవంబర్‌లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం 4.64 శాతంగా నమోదైంది.
కాగా డిసెంబర్‌లో ఆహారోత్పత్తుల సూచీ ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్)లో 0.07 శాతంగా నమోదవడం గమనార్హం. కూరగాయల ధరలు సైతం 17.55 శాతం డిఫ్లేషన్ నమోదు చేశాయని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment