కోరమాండల్ విశాఖ విస్తరణకు ‘గ్రీన్’ సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ తలపెట్టిన సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది. రూ.225 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన, సాధారణ నిబంధనల అమలుకు లోబడి పర్యావరణ అనుమతి మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ తెలియజేసింది. ఫాస్ఫారిక్ ఎరువుల తయారీలో దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్.
ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని శ్రీహరిపురంలో తన యూనిట్ వద్ద ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 700 టన్నుల (ఒక రోజు) నుంచి 1,000 టన్నులకు పెంచుకోవాలనే ప్రణాళికతో ఉంది. తద్వారా ప్రతిరోజూ 3,900 టన్నుల కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ తయారీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే తాజా ప్రాజెక్టు చేపట్టింది. దీనికి నిపుణుల కమిటీ ఇచ్చిన సానుకూల సిఫారసులతో పర్యావరణ అనుమతి లభించింది. కోరమాండల్‌కు విశాఖతోపాటు కాకినాడ, తమిళనాడులోని ఎన్నోర్, రాణిపేట్‌లో ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్ తయారీ కేంద్రాలున్నాయి.