ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు గోఎయిర్ వివరించింది. ఈ వ్యవధిలో జీతభత్యాలు ఉండవు. దీంతో పాటు ఉద్యోగుల వేతనాలను క్రమంగా 20 శాతం మేర తగ్గించాలని గోఎయిర్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దివాలా అంచున ఎయిర్‌లైన్స్ ..
కరోనా వైరస్ కారణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఫ్లైబీ సంస్థ ఇప్పటికే దివాలా తీయగా.. ఈ ఏడాది మే ఆఖరు నాటికి చాలా ఎయిర్‌లైన్స్ మూతపడే ప్రమాదముందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సీఏపీఏ హెచ్చరించింది. పలు విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు 50 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటూ అమెరికాలోని ఎయిర్‌లైన్స్ సంస్థల సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది.
విమానరంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు
పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని పార్లమెంటు ఆమోదించింది. విమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కరోనా వైరస్‌పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment