క్రెడిట్ కార్డు స్వైపింగ్:కస్టమర్ల గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులనుంచి వరుసగా లక్షల కొద్దీ మేర వివిధ వినియోగదారుల కార్డులు స్వైపింగ్ కావడంతో వినియోగదారుల ఆందోళన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా క్రెడిట్‌కార్డుల డేటా చోరీ అయిందనే వార్తలు వీరి అందోళనను మరింత పెంచింది. తమ క్రెడిట్ కార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు స్వైప్ చేశారంటూ లబోదిబోమంటూ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ముఖ్యంగా నగరానికి చెందిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు అమెరికాలో షాపింగ్‌కు వినియోగిస్తున్నట్టు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.80 వేల నుంచి రూ. 3.5 లక్షల షాపింగ్ చేసినట్లు మేసేజ్‌లు రావడంతో సదరు ఖాతాదారులు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఓ ప్రయివేటు ఉద్యోగి బాబూరావు క్రెడిట్ కార్డునుంచి రూ. 40వేలు గల్లంతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన కార్డును బ్లాక్ చేయించారు. అయితే కార్డు బ్లాక్ అయిన తరువాత కూడా వరుస లావాదేవీలకు ప్రయత్నించారని ఆయన చెపుతుండడం గమనార్హం. అసలు పాస్‌పోర్టే లేని తాము అమెరికాకు ఎలా వెళ్తామంటూ వాపోతున్నారు. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు విదేశాలలో స్వైపింగ్ అవుతున్న కార్డులకు సంబంధించిన ఘటనలు ఇప్పటి వరకు 20 వరకు నమోదయ్యాయని, అందులో సుమారు రూ. 25 లక్షల వరకు నగదు డ్రా అయినట్టు తెలుస్తోంది.
ఇలా గత 10 రోజుల నుంచి రోజూ 3 నుంచి 5 ఫిర్యాదులు విదేశాలలో క్రెడిట్ కార్డులు స్వైపింగ్ అవుతున్నట్టు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు అందుతున్నాయి. హైదరాబాద్‌లో ఉండే వారి క్రెడిట్ కార్డు వివరాలు విదేశాలలో ఉన్న వారికి ఎలా చేరుతున్నాయనే విషయంలో సైబర్‌క్రైమ్ పోలీసులకు, బ్యాంకు అధికారులకు అంతులేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇలా విదేశాలలో గుర్తుతెలియని వ్యక్తులు జరుపుతున్న లావాదేవీలలో ఎస్‌బీఐ వీసా క్రెడిట్ కార్డులదే అగ్రభాగంలో నిలుస్తున్నాయని సైబర్‌క్రైమ్ పోలీసుల అంచనా. ఈ క్రమంలో ఓటీపీ లేకుండా, బ్యాంకు ఖాతాదారుడికి తెలియకుండానే వాళ్ల ఖాతాలలో నుంచి డబ్బులు ఖాళీ అవుతుండడంతో ఈ కేసులకు సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా స్వైపింగ్ మిషన్ల నుంచి డాటా చోరీ జరగడం, అమెరికాలో ఉండే వీసా సంస్థ నుంచి ఖాతాదారుల డాటా చోరికి గురికావడం, వాళ్ల డాటా బేస్ హ్యాకింగ్ కావడం వంటి సంఘటనలు జరిగి ఉంటాయనే అనుమానాలు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్స్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విదేశీ లావాదేవీలను డిజేబుల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న ఖాతాదారులు విదేశాలలో తమకు లావాదేవీల అప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. ఇందుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి తమకు విదేశాలలో లావాదేవీలు అవసరం లేవని, ఆ అప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.