లిమిట్ పెరిగితే స్కోరు పెంచుకోవచ్చు..
క్రెడిట్ కార్డులను సక్రమంగా వాడుతూ, సమయానికి చెల్లించేస్తున్న పక్షంలో బ్యాంకులు మధ్య మధ్యలో క్రెడిట్ పరిమితిని పెంచుతుంటాయి. దీంతో ఖర్చు చేసుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది. అదే సమయంలో క్రెడిట్ స్కోరునూ పెంచుకునేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. అదెలాగంటే..
మీరు క్రెడిట్‌ని ఉపయోగించుకోవడంలో పెద్దగా మార్పులు లేకున్నా .. రుణ పరిమితి పెరిగితే దాని ఫలితంగా మీ క్రెడిట్ స్కోరునూ మెరుగుపర్చుకోవచ్చు. ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ రూ. లక్ష ఉన్నా మీరు ప్రతి నెలా రూ. 50,000 మాత్రమే ఖర్చు చేస్తున్నారనుకుందాం. దీనర్థం మీ క్రెడిట్ విని యోగం 50%గా ఉన్నట్లు లెక్క. అదే క్రెడిట్ లిమిట్‌ని రూ. 1.5 లక్షలకు పెంచినా మీరు రూ. 50,000 మాత్రమే ఉపయోగించుకుంటున్నారంటే క్రెడిట్ వినియోగ నిష్పత్తి 33 శాతానికి తగ్గిపోతుంది. అంటే.. మీ దగ్గర వాడుకోవడానికి డబ్బు ఎక్కువగానే ఉన్నా.. మీరు ఖర్చు చేసేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలియజేస్తుంది. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది. దానికి అనుగుణంగా సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో మీకు మరింత మెరుగైన స్కోరు లభించే అవకాశం ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో అండగా..
సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం ఆరు నెలల ఆదాయాన్ని పక్కన పెట్టుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తుంటారు. కానీ, అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు... అధిక క్రెడిట్ లిమిట్ అక్కరకొస్తుంది. ఎమర్జెన్సీలో అండగా నిలవగలదు. ఇక, మరో విషయం.. బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి కదా అని ఎడాపెడా క్రెడిట్ కార్డులను తీసేసుకోకుండా కొంత సంయమనం పాటించాలి. ఒకే కార్డుపై అత్యధిక లిమిట్ లభిస్తున్న పక్షంలో మరిన్ని కార్డులను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు మీ ఖర్చులు రూ. 50,000 ఉండగా.. రూ. 5,00,000 దాకా క్రెడిట్ లిమిట్ లభిస్తుంటే దానికే కట్టుబడి ఉంటే మంచిది. దీని వల్ల అనేక కార్డుల వాడకం, చెల్లింపుల గురించి గందరగోళం ఉండదు.
ఏదేమైనా.. ఒక్కటి గుర్తుంచుకోవాలి. లిమిట్ పెరగడంతో మరింత వాడుకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది. కానీ దీన్ని దుర్వినియోగం చేస్తే.. కష్టాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. కనుక.. స్తోమతకి తగ్గట్లే వాడుకుంటూ, క్రెడిట్ వినియోగ నిష్పత్తి తక్కువ స్థాయిలోనే ఉండేలా చూసుకుంటూ, బాకీలను సమయానికి కట్టేస్తుంటే మంచిది. దీంతో స్కోరు మెరుగుపడి, భవిష్యత్‌లో తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశమూ లభిస్తుంది.