ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,600 కోట్ల నీరవ్ మోదీ-మెహుల్ చోక్సీ బ్యాంక్ స్కామ్ వెలుగుచూసే ఏడాదికి ముందే జెమ్స్, జ్యూవెలరీ రంగంలో అక్రమాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) హెచ్చరించింది. గత ఏడాది జనవరి 5న జ్యూవెలరీ కంపెనీల అకౌంట్స్‌లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకోవడంపై చర్చించేందుకు సీబీఐ, ఈడీ, పది బ్యాంకుల చీఫ్ విజిలెన్స్ అధికారులతో విజిలెన్స్ కమిషన్ భేటీ అయిందని సీవీసీ 2017 వార్షిక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జతిన్ మెహతాకు సంబంధించిన విన్‌సం గ్రూప్‌లో అవకతవకలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
సీవీసీ ఏర్పాటు చేసిన ఈ కీలక భేటీకి పీఎన్‌బీ అధికారులు కూడా హాజరయ్యారు. అప్పటి సమావేశంలో జ్యూవెలరీ కంపెనీలు పాల్పడుతున్న అక్రమాలు, బంగారం దిగుమతుల్లో మోసాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లపై చర్చించామని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి వెల్లడించారు. జతిన్ మెహతా విన్‌సం గ్రూప్ అవకతవకలపైనా ఈ భేటీలో ప్రస్తావించామని చెప్పారు. పీఎన్‌బీ స్కామ్ అప్పటికి వెలుగు చూడకపోయినా జతిన్ మెహతాకూ పీఎన్‌బీ రుణాలిచ్చింది. మెహతాకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు పీఎన్‌బీ లీడ్ బ్యాంకర్‌గా వ్యవహరించడం గమనార్హం.
బ్యాంకర్లకు టోకరా ఇచ్చిన జతిన్ మెహతాకు పీఎన్‌బీ రూ 1658 కోట్లు రుణాలు మంజూరు చేసింది. మెహతా ప్రస్తుతం సెయింట్‌కిట్స్‌లో తలదాచుకున్నట్టు సమాచారం. రూ 6200 కోట్లు రుణాలు తీసుకున్న మెహతా విదేశాలకు పారిపోయారు. జ్యూవెలరీ సంస్థల దిగుమతులు, ఇతర విదేశీ లావాదేవీలపై బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సీవీసీ ఆర్‌బీఐతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖనూ కోరింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోటుపాట్లను అధిగమించేందుకు కీలక సూచనలు చేసినట్టు సీవీసీ నివేదిక స్పష్టం చేసింది. ఏడాది ముందే జ్యూవెలరీ సంస్థల అవకతవకలపై సీవీసీ హెచ్చరించినా నీరవ్ మోదీ, చోక్సీల భారీ స్కాం వెలుగుచూసేంత వరకూ పీఎన్‌బీ అప్రమత్తం కాలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment