ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ .. తనకు ఆ హోదాపై ఆసక్తేమీ లేదని సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. అసలు టాటా గ్రూప్‌లో ఏ పదవీ తనకు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిస్త్రీ వివరించారు. అంతిమంగా వ్యక్తుల కన్నా సంస్థ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తానని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఆదివారం ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ‘నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను.
ఎన్‌సీఎల్‌ఏటీ నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. నాకు టాటా సన్స్ చైర్మన్ హోదా గానీ టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌హోదాపై గానీ ఆసక్తేమీ లేదు. అయితే, బోర్డులో చోటు సాధించడం సహా మైనారిటీ షేర్‌హోల్డరుగా హక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాను‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. మిస్త్రీని చైర్మన్‌గా తిరిగి తీసుకోవాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా గ్రూప్.. సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మిస్త్రీ బహిరంగ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు నాలుగేళ్ల క్రితం చైర్మన్ హోదా నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని పునఃనియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ 2019 డిసెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలు గ్రూప్ సంస్థలు, టాటా ట్రస్ట్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
Comments
Please login to add a commentAdd a comment