
'చర్చపేరుతో అసత్య ప్రచారం వద్దు'
న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీ పేరుతో తమపై అసత్య ప్రచారం తగదని టెలికాం దిగ్జజ సంస్థ ఎయిర్ టెల్ పేర్కొంది. అందరికీ సమానంగా ఇంటర్నెట్ వినియోగం చర్చ పేరుతో అసత్య ప్రచారం చేయడం మంచిది కాదని తెలిపింది. 22 కోట్ల వినియోగదారులు ఉన్న ఎయిర్ టెల్ ఈ అంశంపై తమ కస్టమర్లకు, ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా తమ విధానాన్ని స్పష్టం చేసింది.
అందరికీ ఇంటర్నెట్ చేరువ చేసే నినాదంతో ప్రవేశపెట్టిన 'ఎయిర్ టెల్ జీరో' ప్లాన్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెల్కోలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే నెట్ న్యూట్రాలిటీపై చర్చకు తాము అనుకూలమని.. చర్చ, అసత్య ప్రచారం ఒకటి కాదని ఎయిర్ టెల్ కస్టమర్ బిజినెస్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపాలన్ అన్నారు.