
ఉచిత సేవలు సముచితమే..
- సమర్థించుకున్న ఎయిర్‌టెల్, ఫేస్‌బుక్
- నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని వెల్లడి
న్యూఢిల్లీ: ‘నెట్ న్యూట్రాలిటీ’కి అన్నివర్గాల నుంచి మద్దతు స్వరాలు జోరందుకుంటున్నప్పటికీ... ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్‌లు మరోసారి తమ ఉచిత ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌లను సమర్థించుకున్నాయి. తమ ఉచిత సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని.. యూజర్లకు ఈ సేవల కల్పన విషయంలో ఎలాంటి వివక్షనూ చూపబోమని స్పష్టం చేశాయి.
అందరికీ సమానంగా ఇంటర్నెట్ సేవలను తటస్థంగా అందించాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. కొన్ని వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించడం తీవ్ర వివాదానికి దారితీయడం విదితమే. ఎయిర్‌టెల్ జీరో పేరుతో, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఫేస్‌బుక్ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌తో జట్టుకట్టి కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను ఉచితంగా అందించే సేవలకు తెరతీయడం తెలిసిందే.
దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగడంతో.. ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్, ఎన్‌డీటీసీ, టైమ్స్ గ్రూప్ వంటివి ఎయిర్‌టెల్ జీరో, ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌ల నుంచి వైదొలిగాయి కూడా. కాగా, డిజిటల్ ఇండియాను ప్రోత్సహిం చేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని.. ఓపెన్ ఇంటర్నెట్(నెట్ న్యూట్రాలిటీ)కి కట్టుబడి ఉన్నామంటూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్, ట్రావెల్ పోర్టల్ మేక్‌మైట్రిప్‌లు తేల్చిచెప్పాయి.
కాగా, ఆర్‌కామ్ మొబైల్ నెట్‌వర్క్‌తో జట్టుకట్టడంద్వారా తమ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ భారత్‌లోని లక్షలాదిమంది నెట్ యూజర్లకు ప్రయోజనం చేకూర్చిందని.. అన్ని మొబైల్ ఆపరేటర్ల(టెల్కో)కూ ఈ సేవలను ఆఫర్ చేస్తామని ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్క్ పేర్కొన్నారు. అందరికీ నెట్ అందుబాటు(యూనివర్సల్ కనెక్టివిటీ), నెట్ న్యూట్రాలిటీ అనేవి రెండూ కచ్చితంగా కలిసి కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.
తమ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌లో ఫేస్‌బుక్ తదితర కొన్ని సేవలను ఉచితంగా అందించడం నెట్‌న్యూట్రాలిటీ స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్న విమర్శలను జుకర్‌బర్గ్ కొట్టిపారేశారు. కాగా, ఉచిత ప్లాట్‌ఫామ్‌లో ఉన్నా లేకున్నా అన్ని వెబ్‌సైట్లు, యాప్‌లను యూజర్లకు అందించడంలో ఒకేవిధంగా వ్యవహరిస్తామని ఎయిరల్‌టెల్ సీఈఓ, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విటల్ పేర్కొన్నారు.