ఫేస్ బుక్ మరో కొత్త సర్వీసులు
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త సర్వీసులను భారత్ లో లాంచ్ చేసింది. 2015 నుంచి టెస్ట్ చేస్తున్న 'ఎక్స్ ప్రెస్ వై-ఫై' సర్వీసులను అధికారికంగా భారత్ లోకి తీసుకొచ్చేసింది. ఈ సర్వీసులతో పబ్లిక్ హాట్ స్పాట్ ల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఫేస్ బుక్ అందించనుంది. దేశంలోని గ్రామీణ ప్రాంత యూజర్లకు కూడా ఇంటర్నెట్ ను అందించే లక్ష్యంతో ఫేస్ బుక్ ఈ సర్వీసులను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ సర్వీసులను ఉత్తరఖాండ్, గుజరాత్, రాజస్తాన్, మేఘాలయ రాష్ట్రాల్లోని కనీసం 700 హాట్ స్పాట్ ద్వారా కమర్షియల్ గా అందించనుంది. భారత్, కెన్యా, థాంజనియా, నైజిరియా, ఇండోనేసియా దేశాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ తో పాటు, టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో అదనంగా 20వేల హాట్ స్పాట్లను ఫేస్ బుక్ లాంచ్ చేయనుంది. వచ్చే కొన్ని నెలల్లోనే ఈ వై-ఫై హాట్ స్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. 130 కోట్ల మంది భారత జనాభాలో కేవలం 39 కోట్ల మందే ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉన్నారని ఫేస్ బుక్ ఆసియా పసిఫిక్ హెడ్ ఆఫ్ కనెక్టివిటీ సొల్యుషన్స్ మునీష్ సేథ్ తెలిపారు. తమ గ్లోబల్ కార్యక్రమ ఎక్స్ ప్రెస్ వై-ఫై ద్వారా ఈ కనెక్టివిటీని మరింత విస్తరించనున్నామని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు చాలా సరసమైన ధరల్లో అందుబాటులోకి రావడం, ముఖ్యంగా రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరలు తగ్గడం ఫేస్ బుక్ కు బాగా కలిసి వచ్చి తమ ఇంటర్నెట్ యూజర్ బేస్ ను కంపెనీ భారత్ లో భారీగా పెంచుకుంది.