పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ మాదిరిగానే గత ఏడాది తన హిందుస్తానీ ప్రేమికుని కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి కృష్ణ మండల్ భారత్ చేరుకుంది. ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా కోల్‌కతాకు చెందిన ఆభిక్ మండల్‌తో తొలుత స్నేహం ఏర్పడింది. పాస్‌పోర్టులేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకుంది. ఇక్కడ ఆమె తన ప్రియుడని పెళ్లాడాలనుకుంది. అయితే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రేమికుల కథ ఏ విధంగా సాగిందంటే..
ప్రేమకు హద్దులు ఉండవు. సీమా హైదర్ దీనిని అక్షరాలా నిరూపించింది. అయితే ఈ జాబితాలో ఆమె ఒక్కర్తే లేదు.. ప్రేమలో మునిగితేలుతూ తమ దేశాన్ని విడిచిపెట్టి భారత్ చేరుకున్న పలువురు యువతుల కథలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత ఏడాది అంటే 2022, మే 28న దేశ సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ ఒకటి వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి కృష్ణ తన ప్రేమికుని కోసం రహస్యంగా సరిహద్దులను దాటి భారత్ చేరుకుంది.
సీమా హైదర్-సచిన్ కేసుకు దీనికి పోలిక కనిపిస్తుంది. సీమా హైదర్ తన స్నేహితుడిని పబ్జీ గేమ్ ద్వారా కలుసుకోగా, బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ తన స్నేహితుడిని ఫేస్‌బుక్ మాధ్యమంలో కలుసుకుంది. వీరి స్నేహం అతి త్వరలోనే ప్రేమగా పరిణమించింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణ తన ప్రియుడిని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ దారిలో ఆమెకు దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు లాంటి ఆటంటకాలు ఎదురైనా ఆమెకు ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటిని దాటుకుని ఆమె తన ప్రియుడిని మనువాడేందుకు భారత్ వచ్చింది.
దట్టమైన అటవీప్రాంతం మీదుగా..
కృష్ణకు కోల్‌కతాలోని నరేంద్రపూర్ ప్రాంతానికి చెందిన రానియా అభిక్ మండల్‌తో 2021లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. అది వీరిద్దరి ప్రేమకు దారితీసింది. అనంతరం కృష్ణ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రేమలో నిండా మునిగిన ఆమె పులులు సంచరించే దట్టమైన అటవీప్రాంతంగా పేరొందిన సుందరవనాలను దాటింది. అడవుల్లోని నదులను ఈదుకుంటూ వచ్చి భారత్ చేరుకుంది. ఈ దశలో పలుమార్లు దారి తప్పిపోయింది. పాస్‌పోర్టు లేనందున జనాల కంటపడకుండా రహస్యంగా పశ్చిమబెంగాల్ చేరుకుంది. అక్కడ అభిక్‌ను కలుసుకుంది. కోల్‌కతాలో ప్రేమికులిద్దరూ ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలనుకున్నారు.
పోలీసుల అరెస్టుతో..
అయితే ఇక్కడే ఈ జంటకు ఆటకం ఎదురయ్యింది. కృష్ణ అక్రమంగా భారత్‌లోకి చొరబడిందంటూ పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. తన దగ్గర ఎటువంటి పాస్‌పోర్టు లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకరమైన మార్గంలో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. సురేంద్రపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తరువాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించారు.
ఇది కూడా చదవండి: రోడ్డుపై సడన్‌గా విగ్రహంలా మారిన మహిళ.. టైమ్ ట్రావెల్ చేస్తున్నదంటూ..
Comments
Please login to add a commentAdd a comment