
వేలంలో మాల్యా ‘కారు’చౌక
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా దేశం వదిలి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు ఒక్కొక్కటీ వేలానికి వస్తున్నాయి.
సాక్షి, బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా దేశం వదిలి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు ఒక్కొక్కటీ వేలానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలానికి వచ్చిన అతని రెండు లగ్జరీ కార్లను హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త కారు చౌకగా సొంతం చేసుకున్నారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే రెండు వాహనాలను ముంబై నుంచి నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఆయన రూ.1.4 లక్షలకే కొనుగోలు చేశారు. మాల్యా వాడిన హ్యుండాయ్ సొనాటా గోల్డ్, హోండా ఎకార్డ్‌లకు ముంబై నుంచి ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించారు. సొనాటా గోల్డ్ మార్కెట్ ఖరీదు రూ.13.15 లక్షలు, హోండా ఎకార్డ్ విలువ రూ.21 లక్షలు. సొనాటా గోల్డ్‌ను రూ.40 వేలకు, ఎకార్డ్‌ను రూ.లక్షకే హనుమంత రెడ్డి సొంతం చేసుకున్నారు.
అమ్మాలని అడుగుతున్నారు
‘ఆన్‌లైన్ వేలంలో రోల్స్‌రాయల్స్ మొదలు అనేక మోడళ్ల లగ్జరీ కార్లు మొత్తం 52 వరకూ ఉన్నాయి. రోల్స్‌రాయల్స్ వంటి వాటికి ఎక్కువ పోటీ కనిపించింది. నేను కొనుగోలు చేసిన కార్లు మంచి కండిషన్‌లోనే ఉన్నాయి. వీటిని కొన్న తరువాత రెండింతల ధర ఇస్తాం, అమ్మాలనేవారి సంఖ్య పెరుగుతోంది’ అని హనుమంతరెడ్డి తెలిపారు.