న్యూఢిల్లీ : ‘తక్కువ వడ్డికే అధిక మొత్తంలో రుణం ఇస్తాం, మీ బంగారాన్ని మా సంస్థలోనే తాకట్టు పెట్టండి’ అనే ప్రకటనలను నిత్యం చూస్తునే ఉంటాము. డబ్బు అత్యవసరమైన వేళ ఎవరి దగ్గర చేయి చాచకుండా, తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరాలు తీర్చుకుంటారు చాలామంది. అలానే ఢిల్లీకి చెందిన నీతూ శర్మ అనే మహిళ కూడా పోయిన ఏడాది ఫిబ్రవరిలో అవసరార్ధం తన వద్ద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 14,70,000 సొమ్ము తీసుకుంది. తన వద్ద సొమ్ము సమకూరడంతో బ్యాంకులో తీసుకున్న రుణాన్ని చెల్లించి, బంగారాన్ని విడిపించుకుంది. అయితే బ్యాంకు అధికారులు నీతూ శర్మకు 200 గ్రాముల బంగరాన్ని తక్కువ ఇవ్వడమే కాక అదీ కూడా నకిలీ బంగరాన్ని ముట్టజెప్పారు.
బ్యాంకు అధికారులు తనను మోసం చేసారని గ్రహించిన నీతూ శర్మ ఈ విషయం గురించి బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నీతూ శర్మ ఇచ్చిన ఫిర్యాదులో తాను రుణం తీసుకున్న సమయంలో 22 గాజులను, 9 గొలుసులు కలిపి మొత్తం 890గ్రాముల బంగరాన్ని తాకట్టు పెట్టానని తెలిపింది. అయితే రుణం చెల్లించిన తర్వాత బ్యాంకు అధికారులు తనకు మొత్తం బంగరాన్ని ఇవ్వలేదని, ఇచ్చిన బంగారం కూడా నకిలీదని తెలిపింది. బ్యాంకు తనకు ఇవ్వకుండా ఉన్నవాటిల్లో రెండు వజ్రాలు పొదిగిన గాజులు ఉన్నాయని, వాటి విలువే 35 - 40 లక్షల రూపాయల వరకూ ఉంటుందని పేర్కొంది. తాను ఇచ్చిన గడువులోగా తన బంగరాన్ని తనకు అప్పజెప్పకపోతే బ్యాంకు అధికారుల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment