gold arnaments
-
ఆభరణాల స్వచ్చతలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాల స్వచ్చత విషయంలో మరింత పారదర్శకతను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకువస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) సంఖ్యతో హాల్‌మార్క్ అయిన బంగారు ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా నాలుగు లోగోలతో కూడిన పాత హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల విక్రయానికి మార్చి 31 తర్వాత అనుమతి ఉండదు. సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఏప్రిల్ 1 నుంచి కొత్త హాల్‌మార్కింగ్ విధానం తప్పనిసరి చేయాలని జనవరి 18న నిర్ణయించారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ సంఖ్య అమలుకు ముందు (2023 ఏప్రిల్ 1కి ముందు) పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ నాలుగు లోగోలతో అమల్లో ఉంది. ఇందులో ఒకటి ఆర్టికల్ ప్యూరిటీని సూచిస్తూ ఉండే బీఐఎస్ లోగో ఒకటి. నగల వ్యాపారి, స్వచ్చత(అస్సేయింగ్), హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోలు మిగిలినవి. పాత విధానాల ప్రకారం వినియోగదారుల వద్ద ఉన్న ఆభరణాల హాల్‌మార్క్ చెల్లుబాటు అవుతుందని కూడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. -
సూర్యనారాయణునికి స్వర్ణ మకర తోరణం
సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య మూలవిరాట్టుకు 112 మంది భక్తులు సంయుక్త విరాళాలుగా అందించిన రూ.1.56 కోట్లతో బంగారు మకరతోరణాన్ని తయారు చేయించారు. 3 కేజీల 361 గ్రాముల బరువు గల ఈ బంగారు మకర తోరణాన్ని ఆలయ అనివెట్టి మండపంలో ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ పుణ్యక్షేత్రంలో అత్యధిక విరాళంగా మకరతోరణాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, మండవల్లి రవి (ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు), పెద్దిన కాళిదాస్, పొట్నూరు శ్రీనివాస్ తదితరుల బృందం కమిటీగా ఏర్పడి ఈ విరాళాలను భక్తుల నుంచి సేకరించారు. ఆగస్టు 1న ప్రత్యేక పూజల అనంతరం ఆదిత్యుని మూలవిరాట్టుకు ఈ మకరతోరణాన్ని అలంకరించనున్నారు. -
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు
నంద్యాల: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు. చదవండి: బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి.. -
టిప్‌టాప్‌గా బైక్‌పై వచ్చి.. నెక్లెస్ కావాలని అడిగారు!
సాక్షి, రాజోలు: టిప్‌టాప్‌గా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాజోలులోని ఓ జ్యూయలరీ షాపులో గన్‌తో బెదిరించి బంగారు ఆభరణాల దోపిడీకి ప్రయత్నించడం కలకలం రేపింది. షాపు యజమాని తణుకు సోమ సంతోష్ వాసుదేవ్ ప్రతిఘటించడంతో దొంగలు పరారయ్యారు. ఎస్సై కృష్ణమాచారి కథనం ప్రకారం.. రాజోలు జెడ్ టర్నింగ్లో ఉన్న లక్ష్మీశ్రీనివాస జ్యూయలరీ షాపునకు సోమవారం మధ్యాహ్నం భోజన సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. నెక్లెస్ కావాలని యజమానిని అడిగారు. బంగారు ఆభరణాలు చూపిస్తుండగా బేరమాడుతున్నట్టు నటించారు. ఒక్కసారిగా వారిలో ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న గన్ చూపించి బెదిరించాడు. నగల దోపిడీకి ప్రయతి్నస్తుండగా యజమాని వాసుదేవ్ ప్రతిఘటించాడు. గన్ చూపించిన వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పెనుగులాటలో దొంగలు వాసుదేవ్‌ను ఒక్కసారిగా వెనుకకు నెట్టి పరారయ్యారు. అదే సమయంలో చోరీకి ప్రయత్నించిన ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను వాసుదేవ్ లాక్కున్నాడు. ఈ ఘటనపై రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కృష్ణమాచారి జ్యూయలరీ షాపు వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆభరణాలు చోరీ అవలేదని, గన్‌తో బెదిరించిన దుండగులను సీపీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయతి్నస్తున్నామని ఎస్సై తెలిపారు. చదవండి: లగ్జరీ కారు.. సినిమాటిక్‌గా కొట్టేశారా? ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. ప్లాన్ ఆమెది.. అమలు వారిది.. రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని పలు ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించడంతో పాటు మోటార్ సైకిళ్లను కూడా అపహరించిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారు, 8 మోటార్ సైకిళ్లు స్వాదీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ ఏటీవీ రవికు మార్ ఈ వివరాలు వెల్లడించారు. శాటిలైట్ సిటీ ఏటీఎంలో చోరీ జరిగినట్టు ఈ నెల 3న సమాచారం వచ్చింది. బొమ్మూరు సీఐ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై శుభశేఖర్ దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులపై ఒక అంచనాకు వచ్చారు. సోమవారం ఉదయం 5 గంటలకు హుకుంపేట డీమార్ట్ వద్ద బైక్‌పై ఇద్దరు, కారులో యువతితో పాటు నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిలుకూరుకు చెందిన బొక్కా మణికంఠ రొయ్యల చెరువులు వేసి నష్టపోయాడు. దీంతో స్నేహితులైన కొంతమూరుకు చెందిన బొల్లం యోగనందినీదేవి ఎలియాస్ నందిని, పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాలకు చెందిన నాగరాజు కార్తీ క్ సుదర్శన్‌వర్మ, మహాదేవపట్టానానికి చెందిన బొక్కా రాజేష్, ఏలూరుకు చెందిన బొల్లా బాలసుబ్రహ్మణ్యం, వంగారపు సురేష్, షేక్‌నాగూర్‌తో ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టారు. యోగనందినీదేవి ఏటీఎంల చోరీకి పథకం వేస్తే మిగిలిన ఆరుగురు అమలు చేసే వారు. శాటిలైట్ సిటీ, తాపేశ్వరం, రావులపాలెం, జగ్గంపేట, రాజానగరం, గాడాల, సూరంపాలెం, రాజమహేంద్రవరం పరిసరాల్లోని పలు ఏటీఎంలలో వారు చోరీలకు ప్రయత్నించారు. రావులపాలెం ఏటీఎంతో మాత్రమే రూ.32,200 నగదు వచ్చింది. ఈ ముఠా సభ్యులు మోటారు సైకిళ్ల చోరీలకు కూడా పాల్పడ్డారు. యోగనందినీదేవిపై కాకినాడ పరిధిలో కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై శుభశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పదిక
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. వీటికి మినహాయింపు.. 2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. -
పోయిన పర్సు ఇంటికే వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: సొమ్ములు పోగొట్టుకున్న ఓ మహిళ ఇంటికి చేరేలోపే ఆమె సొమ్ములు భద్రంగా ఉన్నట్లు పోలీసులు సమాచారం అందించడమేగాక బాధితురాలిని పిలిపించి వాటిని అప్పగించిన సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీ పీ నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన అలివేలు సొదరుని వైద్యం కోసం తన రెండు తులాల పుస్తెల తాడు, వెంటి పట్టీలను తనఖా పెట్టేందుకు మార్వాడీ దుకాణానికి వెళ్లింది. మార్వాడి ఇస్తానన్న డబ్బులు సరిపోకపోవడంతో ఆమె మరో ఫైనాన్స్ సంస్థకు వెళ్తుండగా శ్రీరమణ చౌరస్తా వద్ద ఆమె పర్స్ పడిపోయింది. ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్లి చూసుకున్న అలివేలు ఆందోళనకు గురైంది. అదే సమయంలో శ్రీరమణ చౌరస్తా మీదుగా వెళ్తున్న జైస్వాల్ గార్డెన్‌కు చెందిన బుచ్చిబాబుకు రోడ్డుపై దొరికిన పర్సును అంబర్‌పేట పోలీసులకు అప్పగించాడు. పర్సును పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న రసీదు ఆధారంగా మార్వాడి దుకాణాన్ని సంప్రదించి అలివేలు అడ్రస్ తెలుసుకున్నారు. పోచమ్మబస్తీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరాశగా ఇంటికి చేరుకున్న అలివేలు వద్ద వివరాలు తీసుకుని స్టేషన్‌కు పిలిపించి పర్సును అప్పగించారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్స్ అప్పగించిన బుచ్చిబాబును ఏసీపీ అభినందించారు. అలివేలుకు పర్సు అందజేస్తున్న ఏసీపీ నర్సింగరావు -
అసలుది దోచారు.. నకిలీది ఇచ్చారు
న్యూఢిల్లీ : ‘తక్కువ వడ్డికే అధిక మొత్తంలో రుణం ఇస్తాం, మీ బంగారాన్ని మా సంస్థలోనే తాకట్టు పెట్టండి’ అనే ప్రకటనలను నిత్యం చూస్తునే ఉంటాము. డబ్బు అత్యవసరమైన వేళ ఎవరి దగ్గర చేయి చాచకుండా, తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరాలు తీర్చుకుంటారు చాలామంది. అలానే ఢిల్లీకి చెందిన నీతూ శర్మ అనే మహిళ కూడా పోయిన ఏడాది ఫిబ్రవరిలో అవసరార్ధం తన వద్ద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 14,70,000 సొమ్ము తీసుకుంది. తన వద్ద సొమ్ము సమకూరడంతో బ్యాంకులో తీసుకున్న రుణాన్ని చెల్లించి, బంగారాన్ని విడిపించుకుంది. అయితే బ్యాంకు అధికారులు నీతూ శర్మకు 200 గ్రాముల బంగరాన్ని తక్కువ ఇవ్వడమే కాక అదీ కూడా నకిలీ బంగరాన్ని ముట్టజెప్పారు. బ్యాంకు అధికారులు తనను మోసం చేసారని గ్రహించిన నీతూ శర్మ ఈ విషయం గురించి బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నీతూ శర్మ ఇచ్చిన ఫిర్యాదులో తాను రుణం తీసుకున్న సమయంలో 22 గాజులను, 9 గొలుసులు కలిపి మొత్తం 890గ్రాముల బంగరాన్ని తాకట్టు పెట్టానని తెలిపింది. అయితే రుణం చెల్లించిన తర్వాత బ్యాంకు అధికారులు తనకు మొత్తం బంగరాన్ని ఇవ్వలేదని, ఇచ్చిన బంగారం కూడా నకిలీదని తెలిపింది. బ్యాంకు తనకు ఇవ్వకుండా ఉన్నవాటిల్లో రెండు వజ్రాలు పొదిగిన గాజులు ఉన్నాయని, వాటి విలువే 35 - 40 లక్షల రూపాయల వరకూ ఉంటుందని పేర్కొంది. తాను ఇచ్చిన గడువులోగా తన బంగరాన్ని తనకు అప్పజెప్పకపోతే బ్యాంకు అధికారుల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. -
కర్ణాటకను విలన్‌గా చూస్తున్నారు: సిద్ధరామయ్య
బెంగళూరు: ‘మైసూరు నగర నిర్మాత దివంగత నల్వడి కృష్ణదత్త రాజ ఒడెయార్ బంగారు నగలను తాకట్టు పెట్టి కే.ఆర్.ఎస్ డ్యాంను నిర్మించారు. ఇక హారంగి, కబిని, హేమావతిలను కూడా మన సొంత డబ్బు ఖర్చుపెట్టి నిర్మించుకున్నాం. ఈ నాలుగు జలాశయాల నిర్మాణానికి కేంద్ర ప్రభత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అయినా నీటిని సేకరించి ఈ నాలుగు జలాశయాల్లో నిల్వ చేసి పొరుగున ఉన్న తమిళనాడుకు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కావేరి విషయంలో కర్ణాటక బలిపశువయ్యింది.’ అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని గాంధీ భవన్లో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సాధారణంగా ‘కావేరి’ జలాశయాల్లో ఈశాన్య రుతుపనాలు బాగా పడితే 257 టీఎంసీల నీరు ఉండాలని, అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 129 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ మొదటి వరకూ నీటిని వదిలామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ నాలుగు జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవన్నారు. ఈ విషయాలన్నీ చెప్పినా కూడా కావేరి నీటిని తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఎందుకు ఆదేశిస్తోందో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ కర్ణాటకను ప్రతి ఒక్కరూ ఒక విలన్‌గా చూస్తున్నారన్నారు. అయితే కావేరి విషయంలో కర్ణాటక బలిపశువన్నదే సత్యమని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. -
మౌలాలీలో తాళం వేసిన ఇంటికి కన్నం
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని మల్యాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మౌలాలిలోని రాఘవేంద్రకాలనిలో నివాసముంటున్న స్వర్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో వెళ్లి శనివారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తీసి, బీరువా పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 14 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.