
బంగారం ఆభరణాలు, హాల్ మార్క్, ధ్రువీకరణ, డబ్ల్యూజీసీ, సోమసుందరం పీఆర్
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు.
వీటికి మినహాయింపు..
2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు.