Somasundaram PR
-
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పదిక
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. వీటికి మినహాయింపు.. 2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. -
బంగారం డిమాండ్ పడిపోయింది!
న్యూఢిల్లీ : దేశీయంగా బంగారం డిమాండ్ పడిపోయిందట. 2016లో బంగారం డిమాండ్ 21 శాతం మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. భారత్‌లో బంగారం డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు జువెలరీ సమ్మె, పాన్ కార్డు అవసరాలు, డీమానిటైజేషనేనని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2015లో బంగారం డిమాండ్ 857.2 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ రివీల్ చేసింది. ఆభరణాల డిమాండ్ కూడా దేశంలో 22.4 శాతం క్షీణించిందని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంటే, 2016కు వచ్చే సరికి ఈ డిమాండ్ 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఆభరణాల పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇది డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. పాన్ కార్డు నిబంధన, జువెలరీపై ఎక్స్చేంజ్ డ్యూటీ, డీమానిటైజేషన్, ఆదాయపు పన్ను వెల్లడి పథకం డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్నారు. కానీ ఇవన్నీ ఆర్థికవ్యవస్థను మరింత బలపర్చేలా చేస్తాయన్నారు. గోల్డ్ ఇండస్ట్రిలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయన్నారు. నగదు కొరత గ్రామీణ ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీసిందని, కానీ ఈ ప్రభావం తాత్కాలికమేనని, మంచి రుతుపవనాలు బంగారం డిమాండ్‌కు మద్దతిస్తాయని వివరించారు. 2017లో బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని సోమసుందరమ్ అంచనావేశారు.