కర్ణాటకను విలన్‌గా చూస్తున్నారు: సిద్ధరామయ్య
బెంగళూరు: ‘మైసూరు నగర నిర్మాత దివంగత నల్వడి కృష్ణదత్త రాజ ఒడెయార్ బంగారు నగలను తాకట్టు పెట్టి కే.ఆర్.ఎస్ డ్యాంను నిర్మించారు. ఇక హారంగి, కబిని, హేమావతిలను కూడా మన సొంత డబ్బు ఖర్చుపెట్టి నిర్మించుకున్నాం. ఈ నాలుగు జలాశయాల నిర్మాణానికి కేంద్ర ప్రభత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అయినా నీటిని సేకరించి ఈ నాలుగు జలాశయాల్లో నిల్వ చేసి పొరుగున ఉన్న తమిళనాడుకు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కావేరి విషయంలో కర్ణాటక బలిపశువయ్యింది.’ అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరులోని గాంధీ భవన్‌లో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సాధారణంగా ‘కావేరి’ జలాశయాల్లో ఈశాన్య రుతుపనాలు బాగా పడితే 257 టీఎంసీల నీరు ఉండాలని, అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 129 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ మొదటి వరకూ నీటిని వదిలామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ నాలుగు జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవన్నారు. ఈ విషయాలన్నీ చెప్పినా కూడా కావేరి నీటిని తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఎందుకు ఆదేశిస్తోందో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ కర్ణాటకను ప్రతి ఒక్కరూ ఒక విలన్‌గా చూస్తున్నారన్నారు. అయితే కావేరి విషయంలో కర్ణాటక బలిపశువన్నదే సత్యమని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.