ఐఫోన్ 6 కావాలా? 360 గంటలు పనిచెయ్!
జ్యూరిక్‌లో 20 గంటల పనికే...
* కొనుగోలు శక్తిపై యూబీఎస్ నివేదిక
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఐఫోన్ 6 కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఆర్జించాలంటే సగటున 360 గంటల సేపు పనిచేయాల్సి ఉంటోంది. అదే జ్యూరిక్‌లో మాత్రం 20 గంటలే సరిపోతోంది. కొనుగోలు శక్తిపై యూబీఎస్ రూపొందించిన (ప్రైసెస్ అండ్ ఎర్నింగ్స్ 2015) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఢిల్లీ వాసులు 360.3 గంటలు, ముంబై వాసులు 349.4 గంటలు పనిచేస్తే యాపిల్ ఐఫోన్ కొనుక్కోగలిగేంత డబ్బును ఆర్జించగలుగుతారు.
ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 71 నగరాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో కీవ్ (627.2 గంటలు), జకార్తా/నైరోబీ(468 గంటలు) ఉన్నాయి. 353.4 గంటల పనితో కైరో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, జ్యూరిక్, న్యూయార్క్ వాసులు ఐఫోన్ 6 కొనుగోలు చేసేంత డబ్బు ఆర్జించాలంటే మూడు రోజుల కన్నా తక్కువ వ్యవధి పనిచేస్తే సరిపోతోంది. ఆయా నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తిని లెక్కించేందుకు యాపిల్ ఐఫోన్ 6 (16జీబీ మోడల్)ను స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ ప్రామాణికంగా తీసుకుంది.
ఇండియాలో ఐఫోన్-6 ధర రూ. 65,000 వరకూ ఉంది. కొనుగోలు శక్తిలో అట్టడుగున ముంబై, ఢిల్లీ..
నివేదిక ప్రకారం నికరంగా గంట వేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, కనిష్టమైన కొనుగోలు శక్తిని సూచిస్తూ అట్టడుగు పది నగరాల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై ఉన్నాయి. అయితే ఈ నగరాల్లో పనిగంటలు ఎక్కువగా వున్నాయి.
న్యూఢిల్లీలో ఉద్యోగులు ఏటా 2,214 గంటలు, ముంబైలో 2,277 గంటలు సగటున పనిచేస్తున్నారు. ఢిల్లీ వాసులకు సెలవులు ఏటా 26 మాత్రమే ఉండగా, ముంబైలో 21 రోజులు ఉంటున్నాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్కర్లు సగటున వారానికి 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఏటా 4.5 వారాల మేర పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు. వారానికి అత్యధికంగా 50 పని గంటలు, ఏడాదికి 17 సెలవులతో హాంకాంగ్ పని గంటల విషయంలో టాప్‌లో ఉంది. ఇక పారిస్‌లో ఉద్యోగులు వారానికి కేవలం 35 గంటలు (కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పనిచేస్తుండగా, 29 రోజుల పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు.