
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా నమోదుకాగా, ఏప్రిల్ వరకూ ఇదే ధోరణిలో ఎగువముఖంగానే కొనసాగే అవకాశం ఉందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ నివేదిక అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినా, 2022 ఆగస్టు వరకూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) పెరగదని, ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోదని నివేదిక అంచనావేసింది.
అయితే ఆగస్టు తర్వాత జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షాల్లో (ఆర్థిక సంవత్సరం రెండవ భాగం) 50 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచే అవకాశం ఉందని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని యూబీఎస్ సెక్యూరిటీస్ చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు.
తాజా పెరుగుదలకు కారణం లో బేస్ ఎఫెక్టుకు (‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) తోడు సరఫరాల వైపు సమస్యలూ కారణమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే (6.1 శాతం) పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం తక్కువగా 5.9 శాతంగా ఉందని పేర్కొన్నారు.
ధరల తీవ్రత, సరఫరాల్లో సమస్యలు...
కమోడిటీ ధరల పెరుగుదల, సరఫరాల వైపు సమస్యలు, ముడి సరకుల ధరల తీవ్రత వంటి కారణాల వల్ల ఏప్రిల్ వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.6 శాతం శ్రేణిలోనే ఉంటుందన్నది తమ అభిప్రాయమని తెలిపారు. వచ్చే రెండు, మూడు నెలలూ సరఫరాల సమస్యలు కొనసాగుతాయన్నది తమ అంచనా అని తెలిపారు. ఇక ఆరు నుంచి 12 నెలల కాలంలో క్రూడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఎక్కువగా జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం (6.01 శాతం) నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది.
ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతానికి తగ్గించడానికి కారణమని తెలిపింది.
చదవండి: కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్‌మెంట్స్..!
Comments
Please login to add a commentAdd a comment