డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా? | Demat account? | Sakshi
Sakshi News home page

డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?

Published Mon, Jul 27 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?

డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?

నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాల తరహాలోనే షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగపడేదే డీమ్యాట్ అకౌంటు. డీమెటీరియలైజ్డ్ అకౌంటుకు సంక్షిప్త రూపమే డీమ్యాట్ ఖాతా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ మొదలైన బ్రోకరేజి సంస్థలు డీమ్యాట్ అకౌంట్లు ఇస్తున్నాయి. మార్కెట్లలో పెట్టుబడులకు కీలకమైన డీమ్యాట్ అకౌంట్లు, వాటి తీరుతెన్నుల గురించి వివరించేదే ఈ కథనం.

 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ప్రధానంగా బ్యాంకు అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంటు అవసరమవుతాయి. షేర్లు కొనడం, అమ్మడం నగదుతో ముడిపడి ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతా కావాలి. ఆన్‌లైన్లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. ఇక మీరు కొన్న షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చేందుకు డీమ్యాట్ ఖాతా అవసరమవుతుంది. సాధారణంగా బ్యాంకింగ్, బ్రోకింగ్ సేవలు అందించే సంస్థలు.. ఈ మూడింటిని 3-ఇన్-1 అకౌంట్లుగా కూడా అందిస్తున్నాయి. తద్వారా ఈ మూడింటిని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు విడిగా బ్యాంకు అకౌంటు తీసుకుని, దాన్ని వీటికి అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఇక, డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

 చార్జీలు, ఫీజులు: షేరు కొన్నా, అమ్మినా ప్రతిసారీ బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్‌డ్ అమౌంటుగా గానీ లేదా లావాదేవీ విలువలో ఇంత శాతమని గానీ ఉంటుంది. ఉదాహరణకు బ్రోకింగ్ ఫీజు 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు కట్టాల్సి ఉంటుంది. షేర్లు కాకుండా డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటికి వేరే తరహా చార్జీలు ఉంటాయి.
 ఇక బ్రోకరేజి సంస్థలు, సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 దాకా ఫీజులు ఉంటాయి. ఇవే కాకుండా డీమ్యాట్ చార్జీలని (షేర్లు పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), అడ్వైజరీ ఫీజులు, ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఫీజులని సర్వీసుల వినియోగాన్ని బట్టి ఉంటాయి.

 టెక్నాలజీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫాం: డీమ్యాట్ ఖాతాను తీసుకోవడంలో తక్కువ బ్రోకరేజి చార్జీలు మాత్రమే చూసుకుంటే సరిపోదు. సిసలైన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫాం టెక్నాలజీ కూడా అత్యాధునికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకి ఉండాల్సిన లక్షణాలివి..
►క్షణక్షణానికి మారిపోయే షేర్ల రేట్లను రియల్ టైమ్‌లో చూపించాలి
►ఫేవరెట్ స్టాక్స్, ఈవెంట్స్ మొదలైన వాటితో సొంత వాచ్ లిస్ట్ ఏర్పర్చుకునే సదుపాయం ఉండాలి.
►ఫైనాన్షియల్ డేటా, హిస్టరీ, కీలక ఈవెంట్స్, ఆయా కంపెనీల విశ్లేషణ మొదలైనవి అందుబాటులో ఉండాలి.
►నిర్దిష్ట కాలంలో జరిపిన లావాదేవీల హిస్టరీ, పోర్ట్‌ఫోలియో విలువ, లాభనష్టాలు, మార్జిన్ మనీ (అవసరమైతే) మొదలైన వివరాలు తెలిసేలా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఉండాలి.
 
 గుర్తుంచుకోండి...
 సులభతరంగా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యంతో పాటు చౌకగా సర్వీసులు అందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవాలి. ఇందుకోసం వివిధ బ్రోకింగ్ సంస్థల వెబ్‌సైట్లలో డీమ్యాట్ ఖాతాల ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి. ఖాతా స్వరూపం, ఇతర వివరాలు, లావాదేవీలు జరిగే విధానం మొదలైనవన్నీ వీటిలో ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతానో లేదా శాలరీ అకౌంటో కాకుండా కేవలం ట్రేడింగ్ కోసమే ప్రత్యేక బ్యాంక్ అకౌంటు ప్రారంభిస్తే మంచిది. దీనివల్ల మీ లాభనష్టాలు సులభంగా లెక్కకట్టుకోవచ్చు.

ఇక, నిమిష నిమిషానికి మారిపోయే స్టాక్‌మార్కెట్ పరిణామాలు చూసి కంగారుపడిపోకుండా ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడేవిగా ఉండే కొన్ని కంపెనీలనే ఎంచుకోండి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇన్వెస్ట్ చేశాక ఓర్పుగా ఉండండి. అప్పుడే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement