అప్పు తీసుకునే వారేరీ? | Demonetisation of rupee notes: 'Realty prices may crash | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకునే వారేరీ?

Published Sat, Dec 17 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

అప్పు తీసుకునే వారేరీ?

అప్పు తీసుకునే వారేరీ?

నోట్ల రద్దుతో తగ్గిన గృహ రుణ మార్కెట్‌
కొన్నిచోట్ల మంజూరైన రుణాలూ వాపసు
తీసుకోవాలనుకునే వారిదీ వేచి చూసే ధోరణే
రియల్టీ ధరలు తగ్గుతాయేమోనని ఆశలు  


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలు సహా పలు నగరాల్లో గృహ రుణ మార్కెట్‌ డీలా పడింది. బ్యాంకుల్లో జమ చేసిన నగదు పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం లేక... కొనుగోళ్లు, వినియోగం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇంటి రుణాల కోసం బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వైపు తొంగిచూసే వారు కరువయ్యారు. ఈ పరిస్థితి అటు బ్యాంకులను, ఇటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను కలవరపెడుతోంది.

నోట్లకు కటకటతో... 90 శాతానికి పైగా నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత వాతావరణంలో రిటైల్‌ గృహ రుణాలు కావాలంటూ వచ్చే వారి సంఖ్యగణనీయంగా తగ్గిపోయిందని ఈ రంగానికి చెందిన ఫైనాన్స్‌ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, అసలు గృహ రుణం కావాలంటూ గత కొన్ని రోజుల్లో తమ కార్యాలయం తలుపు తట్టిన కస్టమర్‌ ఒక్కరూ లేరనిఆయన పేర్కొనడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇక ఇప్పటికే రుణానికి ఒప్పందం చేసుకుని కొనుగోళ్ల కోసం టోకెన్‌ పేమెంట్‌ తీసుకున్న వారు సైతం... తదుపరి విడత నిధుల కోసం తిరిగి రావడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మరికొందరైతే రుణం వద్దంటూ మంజూరైన వాటిని సైతం రద్దు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.

చూద్దాంలే...
ఇక ఇళ్లు కొనాలనే నిజమైన ఆసక్తితో ఉన్నవారు సైతం ‘చూద్దాం... రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గుతాయేమో’ అన్న ధోరణితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒకరు తెలియజేశారు.

ఉదాహరణకు... ముంబైలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు డీమోనిటైజేషన్‌ ప్రకటన రావడానికి ముందు వరకు ప్రతి నెలా సగటున 15–20 వరకు ఇంటి రుణం కోసం ప్రతిపాదనలు వచ్చేవి. డీమోనిటైజేషన్‌ తర్వాతగత నెల రోజుల్లో వచ్చిన ప్రతిపాదనలు రెండు మాత్రమే. వాస్తవానికి డీమోనిటైజేషన్‌ తర్వాత కొనుగోళ్లు పెరుగుతాయని కొందరు అంచనా వేశారు. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు మరింత మంది ముందుకొస్తారని,దాంతో మార్కెట్‌ మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమైంది. బ్యాంకుల్లోకి భారీగా వచ్చి పడుతున్న నగదు జమలతో రుణాల రేట్లు తగ్గుముఖం పట్టడం కూడా ఈ రంగానికి కలసి వస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యా యి. కానీ, ఇప్పటి వరకు ఆ పరిస్థితులేవీ కనిపించడం లేదు.

ఆరు నెలలు ఆగాల్సిందే...
డీమోనిటైజేషన్‌ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 8న ప్రకటించగా.. ఇప్పటికే ఓ నెల పూర్తయింది. అయినప్పటికీ గృహ రుణ మార్కెట్‌ పుంజుకోలేదని ఓ రియల్టీ సంస్థ ప్రతినిధి చెప్పారు. రుణాల కోసం కస్టమర్లుతిరిగి డిమాండ్‌ చేయడానికి, తాము కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, మొత్తం మీద సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుందన్నది ఆయన అభిప్రాయం.

వ్యాపారంపై ప్రభావం..
ఒకవైపు కార్పొరేట్‌ రుణాల డిమాండ్‌ తగ్గడంతో బ్యాంకులు గత ఏడాదిగా తమ రుణ పోర్ట్‌ఫోలియోని పెంచుకునేందుకు గృహ రుణాలపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు డీమోనిటైజేషన్‌ ఫలితంగా గృహ రుణ మార్కెట్‌పడిపోవడం వాటి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. గత మూడు, నాలుగేళ్లుగా గృహ రుణాల వృద్ధి 20 శాతం పెరుగుతూ వస్తోంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లు కొనుగోలు దారులు తమ నిర్ణయాలనువాయిదా వేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో గృహ రుణ మార్కెట్‌ వ్యాపారం ఏమంత ఉండకపోవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement