చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ
► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్‌సభ, 22గంటలు సాగిన రాజ్యసభ
న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి.
నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్‌సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్‌సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్‌సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్‌సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి.
రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్‌తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు.
దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం
తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు.
ఖర్చు రూ.267 కోట్లు
షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్‌సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది.