ఇది జాతీయ విపత్తు | Congress MLA Jana Reddy Funny Speech In Telangana Assembly | Sakshi
Sakshi News home page

ఇది జాతీయ విపత్తు

Published Sat, Dec 17 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

ఇది జాతీయ విపత్తు

ఇది జాతీయ విపత్తు

నోట్ల రద్దుపై అసెంబ్లీలో జానారెడ్డి
ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు
తుపాను, సునామీల కంటే పెద్ద సమస్య
కూలీ దొరకని పరిస్థితి..వ్యాపారాలు దెబ్బతిన్నాయి
లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం
క్యూలైన్లలో చనిపోయినవారికుటుంబాలకు పరిహారం ఇవ్వాలి


సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రణాళిక రహితం, అనాలోచితం, బాధ్యతా రాహిత్యమని శాసనసభలో విపక్ష నేత జానారెడ్డి అభివర్ణించారు. ఇదొక జాతీయ విపత్తు లాంటిదేనని.. తుఫాను, సునామీల కంటే ఎక్కువగా దేశమంతటా ప్రజలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో ‘నోట్ల రద్దు’ అంశంపై జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడారు. కేంద్రం క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అంచనా వేయకుండా, ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్ణయం తీసుకోవడంతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిందని ఆయన పేర్కొన్నారు.

నల్లధనాన్ని వెలికితీసే లక్ష్యాన్ని తాము స్వాగతిస్తున్నామని... కానీ నోట్ల రద్దుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు మంచిది కాదని ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారన్నారు. ఇది ఆర్థిక మంద గమనానికి దారితీయడంతో పాటు లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదముందని... కూలీ దొరకని పరిస్థితి, వ్యాపారాలు దివాళా, పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరగని దుస్థితి వంటి సమస్యలు వచ్చాయని స్పష్టం చేశారు. కేంద్రాన్ని, బీజేపీని ఉద్దేశించి తాము ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... కేవలం ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ తీరు విడ్డూరం..
నగదు రహిత లావాదేవీలు పూర్తిగా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రే చెబుతుంటే... సీఎం కేసీఆర్‌ తెలంగాణను పూర్తిగా నగదు రహితం చేస్తామనడం విడ్డూరంగా ఉందని జానారెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామాల్లో రైతులు ఎరువులు, విత్తనాలకు డబ్బు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారిని ఆదుకోవాలని కోరారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడి చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం నోట్ల రద్దు ప్రతిపాదన తెస్తే అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి వ్యతిరేకించిన విషయాన్ని జానారెడ్డి గుర్తుచేశారు. అయితే దీనిపై జోక్యం చేసుకున్న కేసీఆర్‌.. మన పరిధిలో లేని అంశాలు ప్రస్తావించవద్దని సూచించారు.

వెంటనే నగదు పంపిణీ చేయాలి: రాజయ్య
నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని సీపీఎం నేత సున్నం రాజయ్య పేర్కొన్నారు. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద రోజుల తరబడి నిలబడుతున్నారని... ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పారు. రోజు కూలీపై బతికే కుటుంబాలు నోట్ల కొరతతో ఉపాధి కోల్పోయాయని.. వెంటనే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి సరిపడా నగదు పంపిణీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

పేదోడు నవ్వుతున్నాడు: కిషన్‌రెడ్డి
నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రయోజనాల కోసం తీసుకు న్నదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని, 50 రోజులు ఈ సమస్య ఉంటుందని ప్రధాని మోదీ తొలిరోజే చెప్పారని గుర్తుచేశారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు తీసుకున్న అసాధారణ నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో పేదవాడు తొలిసారి నవ్వుతున్నాడని, నల్ల కుబేరులు, స్మగర్లు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు.

మినీ బ్యాంకులుండాలి: రేవంత్‌
కేంద్రం నోట్లను రద్దు చేయలేదని, నోట్ల ఉప సంహ రణతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ  ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 96 శాతం నగదు లావాదేవీలే జరిగే దేశం కావడంతో.. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోందన్నారు. ప్రతిగ్రామంలో మినీ బ్యాం కులను ఏర్పాటు చేయాలని.. వాటిని మహిళా పొదుపు సంఘాలకు అప్పగించాలన్నారు.  చిరు వ్యాపారులు, కూరగాయలు, పాలు అమ్ముకునే రైతులకు ప్రభుత్వమే ఉచితంగా స్వైపింగ్‌ మిషన్లు సరఫరా చేయాలన్నారు.

నీది లోపలి బాధ..నాది బయటి బాధ
సీఎంను ఉద్దేశించి జానా చలోక్తులు

సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో నవ్వులు విరిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్ష నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పెద్దనోట్ల రద్దుతో తెలంగాణకు ఆదాయం తగ్గలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారని జానారెడ్డి అన్నారు. అందుకు వెంటనే జోక్యం చేసుకున్న కేసీఆర్‌..  రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదని తాను అనలేదని.. సభ్యులకిచ్చిన నోట్‌లోనూ ఆ విషయం లేదని చెప్పారు. దీనికి స్పందించిన జానారెడ్డి.. కేసీఆర్‌ అలా అనకపోయినా ఆయన మాటల సారాంశం అలాగే అర్థమైందన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తాను బహిరంగంగా బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రి అంతర్గతంగా బాధ పడుతున్నారని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

నీదే కదా వ్యవహారం
‘ఈ నిర్ణయంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను రెండుసార్లు బ్యాంకుకు వెళితే ఒకసారి రూ.6 వేలు, ఒకసారి రూ.24 వేలు ఇచ్చారు’ అని జానారెడ్డి చెప్పారు. పక్కనే ఉన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి.. ‘మీరే నయం. మాకు అవి కూడా ఇవ్వలేదు..’ అన్నారు. ‘డబ్బులతో నీకేం అవసరం.. నువ్వే కదా వ్యవహారం చేసేటోడివి..’ అని జానారెడ్డి మాటకు మాట అనడం అందరినీ నవ్వించింది.

చెక్కు ఇచ్చి డబ్బులు తెప్పించుకున్నా..
ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తనకు తెలుసునని.. అందుకు తానేమీ అతీతుడని కాదని సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఇటీవల ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన. పోయే ముందు తొవ్వ ఖర్చులకు డబ్బు కావాలని బ్యాంకోళ్లతో మాట్లాడిన. రూ.24 వేలకు చెక్కు రాసి పంపిస్తే ఇస్తాం సార్‌.. అన్నారు. తెప్పించుకున్నా. చెక్కులతో డబ్బులు తీసుకోవటం మనకు అలవాటు లేని పని. కానీ ఇప్పుడు తప్పడం లేదు.. మారాలి కదా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement