ఇద్దరితోనూ నాకే బాధ!
- చలోక్తులు, చురకలు, సునిశిత విమర్శలతో సాగిన జానా ప్రసంగం
- బడ్జెట్ అంటేనే గందరగోళం.. దాన్ని ఈటల మరింత గందరగోళం చేశారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై బుధవారం శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతం నవ్వులు పంచింది. అధికారపక్షంపై సునిశిత విమర్శలతో కూడిన చలోక్తులు విసురుతూనే.. అసెంబ్లీలో తన ప్రసంగంపై సొంత పార్టీ సభ్యులు గతంలో చేసిన విమర్శలను కూడా సుతిమెత్తని చురకలతో తిప్పికొట్టారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఈటల రాజేందర్ ఇంకా గందరగోళం చేస్తున్నారంటూ జానా విమర్శించారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి జరుగుతోందన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో చెప్పే ప్రయత్నం చేశారు. గంటకు పైగా సాగిన జానా ప్రసంగాన్ని సభాపతి మధుసూదనాచారి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, అధికార విపక్ష సభ్యులు శ్రద్ధగా ఆలకించారు. ఆయన విసిరిన హాస్యోక్తులకు ఆహ్లాదంగా నవ్వుకున్నారు.
దూకుడు లేదంటూ మా వాళ్లతో బాధ.. వాస్తవాలు చెబితే మీతో..
‘‘నేను అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడుతాను. ప్రతిపక్ష నేతగా ఆవేశంతో, దూకుడుగా పోలేకపోతున్నానని మావాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాను. వాస్తవాలు చెప్పినందుకు మీతో(టీఆర్‌ఎస్) బాధ. ఒకేసారి రెండు బాధలు పడాల్సి వస్తోంది’’ అని జానా అనడంతో సభలో నవ్వులు విరిశాయి. అంతకుముందు పక్కనున్న సభ్యులతో నవ్వుతూ.. ‘నేనెట్ల మాట్లాడుతానయ్యా?’ అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘‘పరుష పదాలను ఉపయోగించి, అహంకారంతో నాకెవరూ సాటిలేరన్నట్లు, హావభావ చేష్టలతో మాట్లాడడం నాకు రాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని భావిస్తాను. నన్ను దీవించండి. నేను చెప్పే వాస్తవాలను కఠోర సత్యాలుగా గుర్తించాలి. లేదంటే కాలానుగుణంగా నేర్చుకుంటారు..’’ అన్న ఆయన.. ‘‘నేను చెప్పినవి ఎట్లాగూ చేయరు కాబట్ట్టి వినకున్నా ఏమీకాదు..’’ అనడంతో మళ్లీ నవ్వులు విరిశాయి.
మండలితో కలిపి పెట్టినా బాగుండేది..
‘బడ్జెట్‌పై మాట్లాడేందుకు కనీసం మూడు గంటలైనా కావాలి. కానీ సీఎం లేరు. మంత్రులు కూడా లేరు’ అని జానా వ్యాఖ్యానించడంతో మంత్రి హరీశ్‌రావు లేచి శాసనమండలికి వెళ్లారని సమాధానమిచ్చారు. దాంతో ఆయన.. ‘‘మంత్రులు మండలికి పోయినరా? రెండు ఒక్కసారి కలిపి సమావేశాలు పెట్టినా బాగుండేది’’ అని అనడంతో నవ్వులు విరిశాయి. బడ్జెట్‌పై మాట్లాడుతూ ‘‘ఈ లెక్కలు, బడ్జెట్ అంటే అసలే గందరగోళం. అయితే మొత్తాన్ని గందరగోళం చేసి వదిలిపెట్టిండు ఈటల రాజేందర్ ’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ఓసీటీఎల్ మూత.. మీ హయాంలోనే
రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ, సేవారంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని జానా అన్నారు. ఈ సమయంలో హోం మంత్రి నాయిని జోక్యం చేసుకుంటూ.. ‘ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి కూడా’ అని అన్నారు. అందుకు వెంటనే స్పందించిన జానా.. ‘మిమ్ముల్ని నమ్మి ఓటేశారు. మూతపడ్డ కంపెనీలు తెరిపిస్తారని. అదేం చేయలేదు. తాజాగా ఓసీటీఎల్ మూతపడింది మీ హయాంలోనే..’ అంటూ తిప్పికొట్టారు.
ప్రతిపక్షం అనేదే ఉండకూడదా?
‘‘కొందరు టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి స్థానం లేదని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ఇంకో పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని అధికారంలోకి వచ్చారా? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపేందుకా? ఏ పార్టీ రాష్ట్రంలో ఉండొద్దు. ఓట్లు అడగడానికి వీల్లేదు అనడం ప్రజాస్వామ్య పద్ధతా? నియంతృత్వ పోకడలకు నిదర్శనం కాదా? అయినా సంయమనం పాటిస్తున్నాం. సర్దిచెప్పుకుంటున్నాం. పక్క అసెంబ్లీ(ఆంధ్రప్రదేశ్)లో నిర్వహణ తీరు చూసి ఆ పరిస్థితి రాకుండా ఉండాలని నా పార్టీ, నేను చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాం’’ అని జానా అన్నారు.
‘‘తమిళనాడులో జయలలిత తన పార్టీ నుంచి అసెంబ్లీలో ఆమె ఒక్కరే ఉన్నప్పుడు గెంటేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి అప్రతిహతంగా సాగుతున్నారు. ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లున్న బీజేపీ.. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి కొనసాగుతోంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అది గుర్తుంచుకోవాలి. కేసీఆర్ చెప్పిన ఆత్మగౌరవ నినాదం అందరికీ వర్తిస్తుంది. అది గుర్తించి పాలన సాగించాలి. అధికారంలోకి తీసుకొచ్చిన సకల జనులు, టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు, సకల జనులు ఆశించిన తీరుగా ప్రభుత్వం సాగాలి..’’ అని అన్నారు.