మేం పాండవులం.. నేను ధర్మరాజును!
• ధర్మం పక్షాన పోరాడుతున్నాం: జానారెడ్డి
• కెప్టెన్ ఒక్కడే బ్యాటింగ్ చేయడు.. అందరికీ అవకాశమివ్వాలి
• మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు
• ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచన
సాక్షి, హైదరాబాద్: ‘‘మేం ధర్మం పక్షాన పోరాడుతున్న పాండవుల్లాంటి వాళ్లం. కాంగ్రెస్ పార్టీ ధర్మం వైపు ఉంది. అందులో నాది ధర్మరాజు పాత్ర. ధర్మరాజు ఒక్కడే గద పట్టుకుని, బాణాలు వేసి యుద్ధం చేశాడా? ధర్మరాజు మాట్లాడుతుంటే భీముడు గద పట్టుకుని లేవాలి, అర్జునుడు బాణాలు వేయాలి. పాండవుల్లో ఎవరి పాత్ర వారు నిర్వహించినట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తారు. ఏమైనా తప్పులు, లోపాలుంటే నేను సరిచేస్తా..’’ అని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ లోని చాంబర్‌లో తనను కలిసిన విలేక రులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రధాన ప్రతిపక్షనేతగా, సభలో సీనియర్ సభ్యుడిగా హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. శాసనసభ గౌరవం పెంచే విధంగా వ్యవహరి స్తున్నానన్నారు. ‘‘నేను మా టీం కెప్టెన్‌ను. ఓపెనింగ్ నుంచి మొత్తం నేనే బ్యాటింగ్, బౌలింగ్ చేయలేను. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించి, వారికి ఆ బాధ్యత అప్ప గిస్తా. మొత్తం నేనే ఆడితే మిగిలినరికి అవకాశం ఎలా వస్తుంది? ఆడటానికి శిక్షణ ఇస్తా, సూచనలు చేస్తా, ప్రోత్సహిస్తా. వారేమైనా తప్పులు చేస్తే సవరించి, టీమ్ సమష్టి ప్రయోజనాలను కాపాడుకుంటా. మొత్తం నేనే ఆడి, గీత దాటితే.. నేనూ ఔట్ అవుతా..’’ అని వ్యాఖ్యానించారు.
హుందాగా ఉంటే బాగుండేది
తెలంగాణ వస్తే ఎలా ఉంటుందని ఆశించామో, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని జానారెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము హుందాగా, గౌరవం పెంచే విధంగా ఉన్నా మని, తమ వల్లే శాసనసభ సజావుగా సాగుతోందని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం కొంత హుందాగా ఉంటే బాగుం డేదన్నారు. కొందరు మంత్రులు హద్దు మీరుతున్నారని, విపక్ష సభ్యులు కూడా తమ లాంటి సభ్యులేనని మరిచిపోయి మాట్లాడుతున్నారని... అది మంచిదికాదని హితవు పలికారు. ‘‘మంత్రులు మాటి మాటికి తెలంగాణ ప్రజలు నా బిడ్డలు, మా కడుపులో పెట్టుకుంటామని అంటున్నారు. మేమేమన్నా పారేస్తున్నమా? బుధవారం కూడా మల్లు భట్టి విక్రమార్కపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సిల్లీగా ఉన్నాయి. భట్టి కూడా మరింత గట్టిగా మాట్లాడాల్సి ఉండేది. హరీశ్‌రావు హుందాగా మాట్లాడాల్సింది..’’ అని ఆయన చెప్పారు.
చిల్లర అవుతుందని మాట్లాడలేదు
ఎర్ర రొయ్యలను కళ్లతో చూడటానికే మల్లన్నసాగర్ కడుతున్నట్టుగా ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పారని.. రొయ్యల కోసం అంతపెద్ద ప్రాజెక్టు కడుతున్నట్టుగా మాట్లా డారని జానారెడ్డి విమర్శించారు. చిల్లరగా ఉంటుందనే దానిపై తాను మాట్లాడలేదని చెప్పారు. భూసేకరణ చట్ట సవరణ విష యంలో తాను అనుమానాలు లేవనెత్తే వరకూ ప్రభుత్వమే దాన్ని గమనిం చలేదని.. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎం దుకు చెప్పానా అనిపిస్తోందని వ్యాఖ్యానిం చారు. కానీ సభలో సభ్యుడిగా తన ధర్మాన్ని పాటించానన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. విద్యుత్ రంగంలో గత పాలకులు లోపభూయిష్టంగా వ్యవహరించారని సీఎం మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికే 20 రాష్ట్రాలు ఉదయ్ పథకంలో చేరాయని, తెలంగాణే చివరలో చేరుతోందని.. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడున్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ గత పాలకులు పూర్తిచేసినవేని గుర్తుచేసుకోవాలన్నారు.