నోట్ల రద్దుతో నష్టమే ఎక్కువ..!
• ప్రయోజనం రూ.80 వేల కోట్లు.. ఖర్చు రూ. 2 లక్షల కోట్లు
• పెద్ద నోట్ల రద్దుపై పరిశీలకుల అంచనా...
• ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతన లేదంటూ విశ్లేషణ
డీమోనిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) వ్యవహారంతో ఒనగూరే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండబోతున్నాయంటూ హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. రద్దు చేసిన పెద్ద నోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవంటూ ప్రభుత్వమే చెబుతుండటం దీనికి ఊతమిస్తోందని వారంటున్నారు. దీంతో మొత్తం డీమోనిటైజేషన్ ప్రక్రియ పరమార్ధమే దెబ్బతింటోందని చెబుతున్నారు.
డీమోనిటైజేషన్ ప్రక్రియతో పెద్ద నోట్లు గణనీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా పోతాయని, రూ. 3 లక్షల కోట్లు- రూ. 5 లక్షల కోట్ల మేర నల్లధనం ధ్వంసమవుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇలా పెద్ద ఎత్తున మిగిలిపోయే మొత్తాలను ప్రజోపయోగ పనులు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన వాటికి వెచ్చిస్తామని, భవిష్యత్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోతాయని ఊదరగొట్టింది. కానీ, రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లు అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవని భావిస్తున్నట్లు తాజాగా కేంద్ర రెవెన్యూ విభాగ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా ప్రకటించడం ప్రభుత్వ హామీలపై సందేహాలు రేకెత్తిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి దాదాపు రూ.12 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి చేరారుు. దీంతో ప్రభుత్వం ముందుగా చెప్పినట్లు ఖజానాకు భారీ నిధులేమీ వచ్చే అవకాశాలేమీ లేకుండా పోరుుందని పరిశీలకులు చెబుతున్నారు. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదని వారు విశ్లేషిస్తున్నారు. ఖర్చులు, ప్రయోజనాలను పోల్చి చూసుకుంటే ఈ ప్రక్రియ కారణంగా ప్రభుత్వం..అంతిమంగా దేశం నష్టపోనుందని అంటున్నారు.
రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనం లెక్కలు..
ప్రభుత్వ లెక్కలను బట్టి రద్దు చేసిన రూ. 15.4 లక్షల కోట్ల నగదులో దాదాపు 30 శాతం నల్లధనం ఉంటుందని అంచనా. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉండొచ్చు. అరుుతే, నవంబర్ 8 నాటి డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నల్ల కుబేరులు ఏదో రకంగా కనీసం రూ. 1.5 లక్షల కోట్లకు చట్టబద్ధత తెచ్చేసుకుని ఉంటారని అంచనా. ఇందుకోసం వారు జన ధన ఖాతాలు, రూ. 2.5 లక్షల పరిమితులు మొదలైన మార్గాలు ఉపయోగించుకుని ఉంటారు. ఇక నవంబర్ 28న ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద దాదాపు రూ.1.3 లక్షల కోట్లు వెల్లడి కావొచ్చని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) అంచనా వేస్తోంది.
కొందరు విశ్లేషకులు దీన్ని కాస్త ఉదారంగా రూ. 1.5 లక్షల కోట్లకు పెంచి రౌండు ఫిగర్ చేశారు. ఇక ముందుగా అనుకున్న రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనంలో మిగిలింది రూ. 1.5 లక్షల కోట్లు. వీటికి సంబంధించి మాత్రమే వివరాల కోసం, చర్యల కోసం ఆదాయ పన్ను విభాగం.. డిపాజిట్‌దారుల వెంటపడాల్సి ఉండొచ్చు. అరుుతే, ఇందుకు కనీసం రెండు మూడేళ్లరుునా పట్టేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (కొత్త ఐడీఎస్‌కి ప్రభుత్వం పెట్టిన పేరు) కింద వెల్లడైన సంపదపై 50% మేర పన్ను విధిస్తే ప్రభుత్వ ఖజానాకు తక్షణం దక్కేది రూ. 75,000 కోట్లు. ఐడీఎస్ కింద డిపాజిట్ చేసే పాతిక శాతం మీద తొలి ఏడాది వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విధంగా రూ. 2,500 కోట్లు మిగులుతుంది. మొత్తం మీద రౌండ్ ఫిగర్ చేస్తే ఒక రూ. 80,000దాకా తేలుతుంది.
లక్షల కోట్ల ఖర్చు..
ఇక ప్రభుత్వానికి వచ్చేది కాస్సేపు పక్కన పెట్టి ఈ మొత్తం ప్రక్రియకు అవుతున్న వ్యయాలు ఓసారి చూస్తే.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)అంచనాల ప్రకారం డీమోనిటైజేషన్ కారణంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై రూ. 1.28 లక్షల కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికం ప్రభావాలు వచ్చే త్రైమాసికంలోను, ఆపైనా కూడా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎంఐఈ కాస్త ఉదారంగా వేసిన లెక్కల ప్రకారమే ఇంత భారీ స్థారుులో నష్టం వాటిల్లనుంది. స్థూలంగా జీడీపీకి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల మేర నష్టం జరగొచ్చని సీఎంఐఈ చెబుతోంది.
డీమోనిటైజేషన్ వాస్తవ ఖర్చులు (కొత్త నోట్లు ముద్రించడం, రవాణా చేయడం మొదలైనవి) దాదాపు రూ. 20,000 కోట్లు ఉంటారుు. బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న నగదుకు తగ్గట్లుగా రూ. 6 లక్షల కోట్ల మేర మార్కెట్ స్థిరీకరణ (ఎంఎస్‌ఎస్) బాండ్లను జారీ చేసేందుకు ఆర్‌బీఐకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి మీద కనీసం 6-6.5% మేర వార్షిక వడ్డీ రేటు నిర్ణరుుంచినా.. 9 నెలల కాలానికి (ఈ వ్యవధిలో అంతా సద్దుమణుగుతుందని అంచనా) ఆర్‌బీఐ కనీసం రూ.30,000 కోట్లు-35,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా కలిపినప్పుడు.. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ఖర్చులు మొత్తం రూ. 2 లక్షల కోట్లుగా లెక్క తేలుతోంది. తీరా చూస్తే వచ్చే లబ్ధి మాత్రం రూ. 80,000 కోట్లే.