డిపాజిట్ల వృద్ధి రేటు...53 ఏళ్ల కనిష్టస్థాయికి
2015-16 డిపాజిట్ వృద్ధి రేటు 9.9%: ఎస్‌బీఐ నివేదిక
ముంబై: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి గడచిన ఆర్థిక సంవత్సరంలో (2015 ఏప్రిల్-16 మార్చి) కేవలం 9.9 శాతంగా నమోదయినట్లు ఎస్‌బీఐ నివేదిక ఒకటి పేర్కొంది. డిపాజిట్లు ఇంత తక్కువశాతం వృద్ధిచెందడం 53 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని ఎస్‌బీఐ తెలిపింది. 2014 నుంచీ డిపాజిట్లు మందగమన ధోరణిలో ఉన్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాంకింగ్ వడ్డీరేట్లతో పోల్చితే... వాస్తవిక వడ్డీరేట్లు (బాండ్ల రేట్లకు సంబంధించి) అధికంగా ఉండడం డిపాజిట్లు తగ్గడానికి కారణమని నివేదిక విశ్లేషించింది. డిపాజిట్ రేట్లు తగ్గడంతో రుణాల మంజూరీకి కూడా బ్యాంకులు వెనకడుగు వేయాల్సి వస్తోందని ఎస్‌బీఐ ఎకనమిక్ రిసెర్చ్ చీఫ్ ఎనకమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.
రెమిటెన్సుల ఎఫెక్ట్...: రెమిటెన్సులు (దేశంలో ప్రవాసీల మదుపు సొమ్ము) భారీగా వెనక్కు మళ్లడం కూడా డిపాజిట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) గణాంకాల ప్రకారం- 2015 మేలో వెనక్కు వెళ్లిన రెమిటెన్సుల విలువ 106 మిలియన్ డాలర్లు కాగా, 2016 ఫిబ్రవరిలో ఈ మొత్తం 449 మిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రకారం... ఒక ప్రైమరీ డీలర్ ద్వారా కరెంట్ లేదా కేపిటల్ అకౌంట్ లేదా రెండింటి లావాదేవీలతో ప్రవాస భారతీయుడు దేశంలో డబ్బు మదుపునకు వీలుంది. 2004లో దీనిని ప్రారంభించిన నాటి నుంచీ ఈ లావాదేవీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌తో ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకూ పంపొచ్చు.