ఎస్‌టీపీ ఉపయోగకరమేనా? | dheerendra kumar counceling for STP | Sakshi
Sakshi News home page

ఎస్‌టీపీ ఉపయోగకరమేనా?

Published Mon, Apr 3 2017 1:07 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఎస్‌టీపీ ఉపయోగకరమేనా? - Sakshi

ఎస్‌టీపీ ఉపయోగకరమేనా?

నేను ప్రవాస భారతీయుడిని, దుబాయ్‌లో పనిచేస్తున్నాను. భారత్‌లో ఉన్న ఎన్నారై అకౌంట్‌ ద్వారా కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నేను భవిష్యత్తులో మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? అలాంటి సౌలభ్యం ఎన్నారై ఇన్వెస్టర్లకు ఉందా ? తగిన వివరాలు ఇవ్వండి.
–రిజ్వాన్, ఈ మెయిల్‌ ద్వారా

మీరు ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) నిబంధనలను పాటించారు. కాబట్టి మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. రెగ్యులర్‌ ప్లాన్‌లతో పోల్చితే డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్‌ ఏజెంట్లకు చెల్లించే కమీషన్లు, డిస్ట్రిబ్యూషన్‌ వ్యయాలు ఉండవు కాబట్టి ఆ మేరకు ఇవి రెగ్యులర్‌ ప్లాన్‌లతో పోల్చితే చౌకగా ఉంటాయి. అందుకని రెగ్యులర్‌ ప్లాన్‌లతో పోల్చితే డైరెక్ట్‌ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది. అయితే డైరెక్ట్‌ ప్లాన్‌లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలో మీరే సొంతంగా నిర్ణయించుకోవలసి ఉంటుంది. అదే రెగ్యులర్‌ ప్లానుల్లో అయితే, మ్యూచువల్‌ ఫండ్‌ ఏజెంట్‌ మీకు తగిన సలహాలు ఇస్తాడు. మరోవైపు డైరెక్ట్‌ ప్లాన్‌లకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్‌ విధి విధానాలన్నింటినీ మీరే స్వయంగా చూసుకోవలసి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి మీకు తగిన అవగాహన ఉంటేనే డైరెక్ట్‌ ప్లానుల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.

నేను రూ.50 లక్షల వరకూ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇప్పుడు స్టాక్‌  మార్కెట్‌ బాగా పెరిగి ఉన్నందున ఏదైనా డెట్‌ ఫండ్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసి ఎస్‌టీపీ(సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌) ద్వారా ఈక్విటీ ఫండ్‌లోకి మార్చుకోమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఇది సరైనదేనా?       –రంగారావు, విజయవాడ

అవును. ఇది సరైన సలహానే. ఎస్‌టీపీ(సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌) అసలు లక్ష్యం ఇదే. ఈక్విటీల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను యావరేజ్‌ చేసుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. మీ విషయమే తీసుకుంటే, మీరు రూ.50 లక్షల ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్‌ బాగా పెరిగి ఉన్నందున ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌ పడిపోయినప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ కూడా పడిపోతుంది. అందుకని అలా కాకుండా మీరు ఈ మొత్తాన్ని ఏదైనా లిక్విడ్‌ లేదా అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ ఫండ్స్‌ కనీసం 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ రాబడులనిస్తాయి. ఇక ఆ తర్వాత ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, వారానికి ఒక లక్ష చొప్పున ఎస్‌టీపీ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆ ఈక్విటీ ఫండ్‌లోకి మళ్లించండి. ఫలితంగా మీ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను యావరేజ్‌ చేసుకున్నట్లు అవుతుంది. స్టాక్‌  మార్కెట్‌లో ఒడిదుడుకులనేవి ఇతర నష్టభయాలతో పోల్చితే విభిన్నమైనది. ఈ నష్టభయాన్ని ఎస్‌టీపీతో నివారించవచ్చు.

ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి ‘హండ్రెడ్‌ మైనస్‌ మై ఏజ్‌’ అనే సూత్రం ఏంటి ? దీనిని తప్పనిసరిగా పాటించాలా?
–కార్తీక్, సికింద్రాబాద్‌


ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి హండ్రెడ్‌ మైనస్‌ మై ఏజ్‌ (వంద నుంచి మీ వయస్సును తీసివేస్తే వచ్చే శాతాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయడం)చాలా ప్రాచుర్యం పొందింది. ఉదాహరణకు చెప్పాలంటే మీ వయస్సు 30 సంవత్సరాలనుకుందాం. అప్పుడు మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతం (100–30)వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అదే మీ వయస్సు 40 సంవత్సరాలనుకుందాం.. అప్పుడు మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతం(100–40) వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గించుకోవాలనేది ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం. ఈక్విటీల్లో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కాబట్టి వయస్సు పెరుగుతున్న కొద్దీ నష్ట భయం తగ్గించుకోవాలనేది ఈ సూత్రం వెనక ఉన్న అసలు ఉద్దేశం.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇది సాధారణ సూత్రం మాత్రమే. ఈ సూత్రం అందరికీ వర్తించదు అని చెప్పవచ్చు. మీకు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ పెరుగుతున్న ఖర్చుల కోసం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ ఆదాయ అవసరాలు తీర్చేలా మీకు కొంత స్థిర ఆదాయం అవసరం. ఈ ఆదాయం పోను మిగిలిన  దాంట్లో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయండి. దీంతో మీ మూలధనం విలువ పెరుగుతుంది. 5–10 ఏళ్ల తర్వాత కొంత మొత్తం అవసరమనుకోండి. మీ మిగులులో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయండి. మొత్తం ఈక్విటీల్లో కూడా ఇన్వెస్ట్‌ చేయడం అర్థం లేని పని, కొంత స్థిరాదాయ మార్గాల్లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలి. స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఈ  స్థిరాదాయ మార్గాలే ఆదుకుంటాయి. దీని కోసం ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్‌)ను పరిశీలించవచ్చు. ఇది గ్యారంటీగా కొంత ఆదాయాన్నిస్తుంది. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement