
‘డిమో’ డిపాజిట్ల గురించి రిటర్నుల్లో చెప్పాల్సిందే
అందుకోసం ప్రత్యేకంగా ఒక కాలమ్
ఆధార్ నంబర్ పేర్కొనడం ఇకపై తప్పనిసరి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో చేసిన నగదు డిపాజిట్ల గురించి కొత్తగా ఆదాయపన్ను రిటర్నుల్లో తెలియజేయక తప్పదు. 2017–18 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి నూతన ఆదాయ పన్ను రిటర్నుల విషయమై ఆ శాఖ త్వరలోనే నిబంధనలను నోటిఫై చేయనుంది. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. చెల్లని నోట్లను మార్చుకోవడంతోపాటు అదే ఏడాది డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతించింది.
ఈ కాలంలో చేసిన డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఆదాయపన్ను రిటర్నుల పత్రాల్లో ఒక కాలమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వేతన జీవులు సులభంగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా ‘సహజ్’ పేరుతో తీసుకురానున్న ఐటీఆర్–1లోనూ ఈ కాలమ్‌ను ఉంటుందని వెల్లడించాయి. డీమోనిటైజేషన్ సమయంలో నమోదైన అన్ని డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడమే దీని వెనుకనున్న ఉద్దేశంగా తెలిపాయి.