బెంగళూరు : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు దీపావళి బొనాంజ ఇవ్వబోతుంది. దీపావళి కానుకగా ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లను(ఈఎస్‌ఓపీలను) తిరిగి కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు ఆమోదించినట్టు తెలిసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో 6వేల మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని ఈ విషయం తెలిసిన సంబంధిత వర్గాలు చెప్పాయి. దేశీయ స్టార్టప్ సెక్టార్‌లో ఇప్పటి వరకు అతిపెద్ద షేర్ బైబ్యాక్ ప్లాన్ ఇదే కావడం విశేషం. కంపెనీ వాటాదారులకు ఇది అతిపెద్ద అవకాశమని తెలిసింది. 100 మిలియన్ డాలర్లకు(రూ.656 కోట్లకు పైగా) ఈ ఈఎస్‌ఓపీలను ఫ్లిప్‌కార్ట్ తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి..
జపాన్ సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్, చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ వంటి పెట్టుబడివారుల నుంచి 4 బిలియన్ డాలర్లను సమీకరించిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ ప్లాన్‌కు తెరతీసింది. ఫ్లిప్‌కార్ట్ సబ్సిడరీలు ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా, పేమెంట్ యూనిట్ ఫోన్‌పే ఉద్యోగులు కూడా ఈ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల తిరిగి కొనుగోలు ప్రొగ్రామ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ ప్రొగ్రామ్ కింద ఉద్యోగులు కొంత మొత్తంలో షేర్లను విక్రయించుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ వరకు ఈ ప్రక్రియను ముగించేయాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తోంది. అయితే ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.