రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దసరా, దీపావళి కానుక అందించింది. రాబోయే పండుగలకు భారతీయ రైల్వే ఉద్యోగులకు అందించే బోనస్ పై ముఖ్యమైన ప్రకటన చేసింది. ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ బోనస్ ) ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2,245 కోట్లను కేటాయించింది. అర్హతగల రైల్వే ఉద్యోగికి నెలకు కనిష్టంగా రూ.7వేల జీతం, గరిష్టంగా రూ.17,951 వేతన జీవులకు 78రోజుల వేతనం బోనస్‌గా అందించనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా 12 లక్షల మందికి పైగా నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అంతేకాదు పండుగకుముందే ఈ నెలాఖరుకు ఈ బోనస్‌ను చెల్లించనున్నట్టు వెల్లడించింది. బోనస్ ఇవ్వడం ద్వారా, ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు, వారి ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రైల్వే కస్టమర్లకు భద్రత, వేగం, తదితర మెరుగైన సేవలను అందించడానికి, ప్రేరేపించడానికి దారి తీస్తుందని తెలిపింది. అలాగే కోలకత్తాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మెట్రో రైల్వే ఉద్యోగులకు జీతాలను ముందుగా చెల్లించనుంది. సెప్టెంబర్ 30కి బదులుగా సెప్టెంబర్ 22వ తేదీనే వీరికి జీతాలను అందించేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదిం తెలిపింది.