
22 శాతం తగ్గిన డీఎల్‌ఎఫ్ నికర లాభం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 22 శాతం తగ్గింది. ఇతర ఆదాయం బాగా పడిపోవడం, అధిక పన్ను వ్యయాల కారణంగా నికర లాభం తగ్గిందని డీఎల్‌ఎఫ్ తెలిపింది. 2013-14 క్యూ4లో రూ.220 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.172 కోట్లకు తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.1,969 కోట్ల నుంచి రూ.1,954 కోట్లకు పడిపోయిందని పేర్కొంది.
ఇతర ఆదాయం రూ.552 కోట్ల నుంచి రూ.147 కోట్లకు తగ్గిందని, పన్ను చెల్లింపులు మాత్రం రూ.68 కోట్ల నుంచి రూ.77 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ.123 వద్ద ముగిసింది.