మీ ఇంటికి బీమా ఉందా?
♦ దేశంలో బీమా లేని ఇళ్లు 70 శాతంపైనే?
♦ చాలామందికి బీమాపై అవగాహనే లేదు
♦ బజాజ్ అలియంజ్ సర్వేలో వెల్లడి
♦ ఎలాంటి ప్రమాదానికైనా బీమాతోనే రక్ష
కిషోర్‌కు ఎప్పుడూ సొంతింటి ఆలోచనే. దానికి తగ్గట్టే బ్యాంకు లోన్ ద్వారా ఇల్లు కొన్నాడు. అయితే రెండేళ్లు గడిచాక కిషోర్‌కు ఒకరోజు పెద్ద ప్రమాదం. ఆరోగ్యం దెబ్బతింది. సంపాదన తగ్గింది. లోన్ ప్రీమియం చెల్లించలేని పరిస్థితి!!. ఫలితం... బ్యాంక్ వారు ఇంటిని వేలానికి పెట్టారు. మరి కిషోర్ కుటుంబ పరిస్థితేంటి? ఈ మధ్య భూకంపాలు, వర దల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఇళ్లు దెబ్బతింటున్నాయి. ప్రేమతో కొన్న ఇల్లు ఇలా ప్రమాదాల బారిన పడితే పరిస్థితేంటి.
దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం బీమా తీసుకోవటమే. ఇంటి బీమాకు పలు సంస్థలు పలు బీమా పథకాల్ని అందిస్తున్నాయి. మనకు అనువైన పథకాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటి బీమాపై ఇటీవల బజాజ్ అలియంజ్ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటి బీమా తీసుకున్న వారు 30 శాతమే!
మన దేశంలో చాలా మందికి ఇంటి బీమాపై సరైన అవగాహన లేదు. అందుకే దేశంలో 30 శాతం మందే దీన్ని తీసుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మందికి సొంతిళ్లు ఉండగా, మిగిలిన 40 శాతం మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంటి బీమా తప్పనిసరిగా తీసుకోవాలనుకునే వారు 75 శాతం మంది ఉన్నప్పటికీ బీమా తీసుకున్నవారు మాత్రం 30 శాతం మందే ఉన్నారు.
భూకంపాలతోనే అధిక నష్టం...
ఇళ్లకు భూకంపం వల్లే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు 64 శాతం మంది ఇంటి యజమానులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదాలతో నష్టం రావచ్చని 28 శాతం మంది, దోపిడీల గురించి 8 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె ఇళ్ల వారిలో భూకంపాలపై 56 శాతం మంది, అగ్నిప్రమాదంపై 30 శాతం మంది, దోపిడీలపై 14 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఫైనాన్స్ సదుపాయానిదే అధిక వాటా
ఇంటి కొనుగోలుకు 37 శాతం మంది ఫైనాన్స్‌పై, 31 శాతం మంది గృహ రుణాలపై ఆధారపడగా... 32 శాతం మంది రెండు ఆప్షన్లతోనూ ఇళ్లు కొంటున్నారు. నివాసం ఉండటానికి ఇళ్లను కొనేవారు 66 శాతం మంది ఉండగా, మిగిలిన వారు పెట్టుబడి సాధనంగా ఇళ్లను కొంటున్నారు.
ప్రాపర్టీ ధరల తగ్గుద లే అనువైన సమయం
ప్రాపర్టీ ధరలు తగ్గినప్పుడు ఇళ్లను కొనేవారే అధికం. అలాంటపుడు ఇళ్లను కొనాలనుకునేవారు 46 శాతం మంది ఉండగా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇళ్లను కొనాలనుకునేవారు 41 శాతం మంది. 13 శాతం మంది మాత్రమే పండుగల సీజన్‌లో ఇళ్లను కొనాలనుకుంటున్నారు. 60 శాతం మంది వారి ఇంటి బీమా ను ఫైనాన్స్ సౌకర్యం కల్పించిన బ్యాంకుల ద్వారా, 40 శాతం మంది ఏజెంట్ల ద్వారా తీసుకున్నారు.