
మూడేళ్లలో ఎయిర్‌టెల్...
దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మెగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది.
రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
నెట్‌వర్క్ మెరుగుదలే లక్ష్యం...
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మెగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. నెట్‌వర్క్ మెరుగుదల, సర్వీసుల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా వచ్చే మూడేళ్లలో రూ.60,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేసింది. టెలికం రంగంలో పోటీ తీవ్రతరమవుతుండటం, కాల్ డ్రాప్ సమస్యపై కేంద్రం కొరడా ఝుళిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ తాజా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాల్‌డ్రాప్‌లను అరికట్టేందుకు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను పెంచుకోవడంపై భారీగా పెట్టుబడి పెట్టాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికం కంపెనీలకు పదేపదే సూచిస్తున్న సంగతి తెలిసిందే.
‘ప్రాజెక్ట్ లీప్’లో భాగంగా ఈ మొత్తాన్ని ఎయిర్‌టెల్ వెచ్చించనుంది. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో 70,000 బేస్ స్టేషన్లను నెలకొల్పనున్నామని... ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని భారతీ ఎయిర్‌టెల్ (భారత్, దక్షిణాసియా) ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ తెలిపారు. మొత్తమ్మీద మూడేళ్లలో 1,60,000 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనునున్నట్లు చెప్పారు.
అత్యధికం మౌలికంపైనే...
రూ.60 వేల కోట్ల పెట్టుబడుల్లో అత్యధిక మొత్తాన్ని కాల్, డేటా సేవల నాణ్యత పెంచేవిధంగా మౌలిక సదుపాయాలపైనే ఖర్చు చేయనున్నట్లు మిట్టల్ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 2.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.16,000 కోట్లు) పెట్టుబడి కూడా తాజా ప్రణాళికల్లోకే వస్తుందన్నారు. కంపెనీ చరిత్రలో ఒకే ఏడాదిలో ఇదే అత్యంత భారీ పెట్టుబడిగా కూడా ఆయన చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా చౌక 4జీ సేవలను అందించేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.