డాక్టర్ రెడ్డీస్ లాభం 17% డౌన్ | Dr Reddy's Lab drops in volatile trade after declaring weak Q2 result | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్ లాభం 17% డౌన్

Published Thu, Oct 30 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

డాక్టర్ రెడ్డీస్ లాభం 17% డౌన్

డాక్టర్ రెడ్డీస్ లాభం 17% డౌన్

క్యూ2లో రూ.574 కోట్లు
* ఉత్తర అమెరికా జనరిక్ మార్కెట్లో ధరల ఒత్తిడి
* హుదూద్ నష్టం రూ. 40 కోట్లు
* వైజాగ్ యూనిట్లలో ఉత్పత్తి షురూ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 17 శాతం క్షీణతను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 690 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 574 కోట్లకు పడిపోయింది. ఉత్తర అమెరికా జెనరిక్ వ్యాపారంలో వృద్ధి స్వల్పంగా ఉండటం, ధరలపై ఒత్తిడికి తోడు రష్యా,ఉక్రెయిన్ కరెన్సీల క్షీణత లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ ఉత్తర అమెరికాలో కొనుగోలుదారులు ఏకమవ్వడంతో ధరలు తగ్గాయన్నారు. దీనికి తోడు కొత్త ఉత్పత్తుల అనుమతుల్లో జాప్యం కావడం ఫలితాలపై ప్రభావం చూపిందన్నారు.

సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 7% వృద్ధితో రూ. 3,357 కోట్ల నుంచి రూ. 3,587 కోట్లకు చేరింది. డాక్టర్ రెడ్డీస్‌కి ప్రధానమైన ఉత్తర అమెరికా మార్కెట్లో కేవలం 8 శాతం వృద్ధి, యూరప్, రష్యా మార్కెట్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపిందన్నారు. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలో నమోదు చేయని విధంగా 14 శాతం వృద్ధితో రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఆర్‌అండ్‌డీకి 37 శాతం నిధులు పెంచడం కూడా లాభాలు తగ్గడానికి మరో కారణంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి వివరించారు. అమెరికా మార్కెట్లో ధరల పతనం కనిష్ట స్థాయికి చేరిందని భావిస్తున్నామని, వచ్చే త్రైమాసికాల్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుండటంతో భవిష్యత్తు ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు.
 
హుదూద్ నష్టం రూ. 40 కోట్లు
హుదూద్ తుపాన్ వల్ల డాక్టర్ రెడ్డీస్‌కి సుమారు రూ. 40 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేసినట్లు చక్రవర్తి తెలిపారు. డాక్టర్ రెడ్డీస్‌కి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం సమీపంలో రెండు యూనిట్లు ఉన్న సంగతి తెలిసింది. తుపాన్ వలన ముడి పదార్థాలతో పాటు యూనిట్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ మొత్తానికి బీమా రక్షణ ఉందన్నారు. ప్రస్తుతం ఈ రెండు యూనిట్లు సాధారణ స్థితికి చేరుకొని ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement
Advertisement