ఐఫోన్ 6 ధర రూ.56,000 రేంజ్‌లో!
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6ను రూ.56,000 ధరల రేంజ్‌లో అందిస్తామంటూ ఈ కామర్స్ సంస్థలు ఊరిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఖచ్చితంగా ఎప్పుడు భారత్ మార్కెట్లోకి విడుదల చేసేదీ, ధర తదితర విషయాలను యాపిల్ కంపెనీ ఇంతవరకూ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, పలు ఈ కామర్స్ కంపెనీలు ఈ నెల రెండో వారం నుంచి రూ.56,000 ధరల రేంజ్‌లో ఈ ఫోన్‌ను అందిస్తామని అంటున్నాయి.
ఈబే సంస్థ రూ.55,954 ధరకే ఐఫోన్ 6ను అక్టోబర్ 8 నుంచి అందిస్తామని తెలిపింది. ఎలాంటి డెలివరీ చార్జీలు తీసుకోబోమని పేర్కొంది. ఐ ఫోన్ 6 ప్లస్‌ను రూ.77,000కు ఆఫర్ చేస్తామని వివరించింది. ఇక షాప్‌క్లూస్‌డాట్‌కామ్ సంస్థ రూ.59,999 ధరకు అక్టోబర్ 8 నుంచి అందిస్తామని పేర్కొంది. డెలివరీ చార్జీ రూ.149 అని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను యాపిల్ కంపెనీ గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది.
అక్టోబర్ మధ్య నుంచి గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ భారత్‌లో ఈ ఫోన్లను యాపిల్ విక్రయించనున్నదని ఉహాగానాలున్నాయి. ఐ ఫోన్, ఐఫోన్ 6ల్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర వంటి ఫీచర్లున్నాయి. 2జీ, 3జీ, 4 జీనెట్‌వర్క్‌లను ఇవి సపోర్ట్ చేస్తాయి. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షన్లలలో ఇవి లభ్యమవుతాయి.