
ఈ-పాఠశాలతో కాలేజీకి గుర్తింపు!
వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది.
♦ విద్యా సంస్థలకు యూజీసీ, న్యాక్, ఎన్‌సీఆర్టీ వంటి గుర్తింపు సేవలు
♦ అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు కూడా అందిస్తున్న స్టార్టప్
♦ 400లకు పైగా విద్యా సంస్థలకు సేవలు 2 నెలల్లో యూఎస్, సింగపూర్,
♦ దక్షిణాసియాలకు విస్తరణ
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లాడిని కాలేజీలో చేర్పించాలంటే ముందుగా చూసేది టీచర్లెవరు? గత విద్యా సంవత్సరంలో ఎన్ని ర్యాంకులొచ్చాయి? ఎంత మంది పాసయ్యారు? కాలేజీకి ఏ గ్రేడుందని!! దీన్లో ర్యాంకులు.. మార్కులనేవి టీచర్ల బోధన, విద్యార్థుల ప్రతిభ బట్టి ఉంటాయి. మరి కాలేజీగ్రేడ్‌ల సంగతేంటి? అంటే యూజీసీ, న్యాక్, ఎన్‌బీఏ, ఏఎంబీఏ, ఎన్‌సీఆర్‌టీ వంటి సంస్థలిచ్చే గ్రేడ్‌లు పొందేదెలా? నిజానికి వీటి గుర్తింపు పొందాలంటే చాతాండతం పని ఉంటుంది.
కళాశాల సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ (ఎస్‌ఎస్‌ఆర్) నుంచి మొదలుపెడితే ఉపాధ్యాయుల ప్రతిభ, విభాగాల సంఖ్య, ఫీజులు, గత రెండేళ్ల ఫలితాలు, బడ్జెట్, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్, సంస్థ మాస్టర్‌ప్లాన్, ఆడిటర్ రిపోర్ట్ వంటి బోలెడంత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అందుకే చాలా విద్యా సంస్థలు వీటికి దూరంగా ఉంటాయి. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకుంది ‘ఈ-పాఠశాల’! ఈ స్టార్టప్ అందించే సేవల వివరాలు సంస్థ కో-ఫౌండర్ సుమన్ నంది మాటల్లోనే...
రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా 2014లో ‘ఈ-పాఠశాల’ను ఆరంభించాం. క్లౌడ్ ఆధారంగా పనిచేసే ఈఆర్పీ సొల్యూషనే మా ప్రత్యేకత. అంటే గ్రేడ్ల కోసం మాన్యువల్ ప్రాసెస్ అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపిస్తామన్నమాట.
అడ్మిషన్ నుంచి ఆలూమినీ వరకూ..: విద్యా సంస్థలకు గ్రేడ్లను అందించడమే కాక కళాశాల బోధనేతర సేవలు... అంటే విద్యార్థి అడ్మిషన్ నుంచి మొదలుపెడితే మెంటరింగ్, ప్రొఫైల్ మ్యాపింగ్, అకడమిక్ ప్రోగ్రెస్, ప్లేస్‌మెంట్, ఫీడ్‌బ్యాక్, అలూమినీ వరకూ ప్రతీ ఒక్కటీ చేసిపెడతాం. ఆన్‌లైన్‌లో సిలబస్, పరీక్షలు, ఫలితాలూ ప్రకటిస్తాం. బోధనేతర సేవల్లో మా ప్రత్యేకత ఏంటంటే.. కళాశాలలో అందరికీ ప్రత్యేకంగా ఒక డాష్‌బోర్డ్‌ను ఇస్తాం. అంటే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థి ఇలా ఒక్కో బోర్డ్ ఉంటుందన్నమాట. ఇందులో ప్రిన్సిపల్ డాష్‌బోర్డ్‌లో అడ్మిషన్లు, ప్లానింగ్, ఫీజులు, హాజరు శాతం, పరీక్షలు, గుర్తింపు.. వివరాలుంటాయి. ఉపాధ్యాయుల బోర్డ్‌లో.. డె డ్‌లైన్ ఐక్యూఏసీ, రికార్డ్‌లు ఉంటాయి. విద్యార్థుల బోర్డ్‌లో పరీక్షల తేదీలు, ఫలితాలు, ఫీజులు వంటివి ఉంటాయి.
తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు..: ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానం ద్వారా ఒకో విద్యార్థి ఏ అంశంలో వెనకబడ్డాడో బేరీజు వేస్తాం. ఒకో విభాగంలో వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో కొలతలు తీస్తాం. ఆ సమాచారాన్ని తల్లిదండ్రులు, టీచర్ల ముందు పెడతాం. దీనికి తోడు పిల్లల ప్రవర్తన, పరీక్షల టైం టేబుల్, ఇతర ముఖ్య విషయాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్, ఈమెయిళ్ల రూపంలో అందిస్తాం.
ధరలు రూ.50 వేల నుంచి..: ఈ-పాఠశాల ఏం చేస్తుందంటే.. ఆయా సంస్థలు వాటి ప్రమాణాలేంటి? ఉత్తమమైన గ్రేడ్లు పొందేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో 360 డిగ్రీల్లో సూచనలిస్తాం. అంటే కళాశాల క్వాలిటీ, ఎక్కడ వసతులు బాగాలేవో.. ఏం చేయాలో సూచిస్తాం. బడ్జెట్, ఆడిటింగ్ రిపోర్టుల్లో ఉన్న తేడాలను గుర్తించి సరిదిద్దుతాం కూడా. ఇవి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి.
400లకు పైగా కాలేజీలకు..: ఇప్పటివరకు 400లకు పైగా కాలేజీలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 12 ఉన్నాయి. ఇప్పటివరకు పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. వీటి సాయంతో వచ్చే రెండునెలల్లో అమెరికా, సింగపూర్, దక్షిణాసియా ప్రాంతాలకు విస్తరిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...