నా వయస్సు 23 సంవత్సరాలు. ఏదైనా మిడ్-క్యాప్ ఫండ్‌లో ప్రతి నెలా రూ.2,000 చొప్పున 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. దేనిని ఎంచుకోమంటారు? - మార్కండేయ, హైదరాబాద్
మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీల నుంచి మీరు ఎంచుకున్న ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నవే. మేము రెగ్యులర్‌గా ఇచ్చే రికమండేషన్లలో ఈ ఫండ్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఈ రెండు ఫండ్లు కూడా క్వాలిటీ పైననే దృష్టిపెడతాయి. ఈ ఫండ్స్ ట్రాక్ రికార్డ్ కూడా బావుంది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్‌తో పోల్చితే ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ వెనక మొదలైనప్పటికీ, చెప్పుకోదగ్గ పనితీరునే కనబరుస్తోంది. అయితే ఈ రెండు ఫండ్స్ కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ ఒడిదుడుకులను తట్టుకోలిగితే , ఈ రెండింట్లో ఏ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ప్రతీ ఏడాది ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ పనితీరును సమీక్షించడాన్ని మాత్రం మరచిపోవద్దు. ప్రస్తుతమున్నట్లేగానీ వీటి పనితీరు భవిష్యత్తులో కూడా ఉంటే మీరు మంచి రాబడులు పొందుతారు.
నా పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్స్‌తో పాటు బీఎన్‌పీ పారిబస్ మిడ్‌క్యాప్, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ మిడ్-క్యాప్ ఫండ్స్‌ను కొనసాగించమంటారా? మొత్తం పెట్టుబడులను ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఒకేసారి బదిలీ చేయవచ్చా? - వేణుగోపాల్, కరీంనగర్
మీ పోర్ట్‌ఫోలియోలోని మొదటి మూడు ఫండ్స్ మంచి పనితీరును కనబరుస్తున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మిడ్-క్యాప్ ఫండ్స్ కూడా మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. బీఎన్‌పీ పారిబస్ మిడ్‌క్యాప్ పనితీరు అద్భుతమేనని చెప్పవచ్చు. మరోవైపు సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్ ఇప్పుడిప్పుడే వృద్ధి బాట పడుతోంది. మీరు ఒడిదుడుకులను తట్టుకోగలిగితే ఇదే ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు ఇప్పటివరకూ మార్కెట్ అనుకూలంగా లేదు. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మొత్తం పెట్టుబడులను ఒకేసారి బదిలీ చేసుకోవచ్చు.
నేను మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెలకు రూ.5,000 చొప్పున 3-5 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయగలను. ఎస్‌బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. సరైన ఫండ్స్‌నే ఎన్నుకున్నానా? - భాస్కర్, విజయనగరం
మీరు ఎంచుకున్న ఈ రెండు ఫండ్స్ కూడా మంచివే. అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కాలానికి, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తానికి ఇవి సరైనవి కావు. ఈ ఫండ్స్ పనితీరులో ఒడిదుడుకులుంటాయి. దీంతో మీకు అసంతృప్తి ఉండొచ్చు. ఎస్‌బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్ ఇస్తే అద్భుత ఫలితాలనివ్వవచ్చు. లేదా పనితీరు అధ్వానంగా ఉండొచ్చు. అందుకే మొదటిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి, 3-5 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసేవారికి ఇది సరైన ఫండ్ కాదు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్ ఫండ్ అనేది బ్యాలెన్స్‌డ్ ఫండ్. ఈ ఫండ్ ఈక్విటీ కేటాయింపులు అధికంగా మిడ్-క్యాప్ స్టాక్స్‌కే ఉన్నాయి. ఇది కూడా మీకు తగినది కాదు. ఈక్విటీ కేటాయింపులు సమతూకంగా ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను రెండింటిని ఎంచుకోండి. ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
1-2 నెలల కోసం సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం కోసం చూస్తున్నాను. ఈ విషయంలో తగిన సూచనలివ్వండి.
- థామ్సన్, తిరుపతి
కేవలం ఒకటి, లేదా రెండు నెలల కాలానికి లిక్విడ్ ఫండ్స్‌ను, లేదా ఆల్ట్రా షార్ట్-టర్మ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్ మంచి రాబడులనే అందిస్తాయి. లిక్విడ్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్‌ను ఎంచుకోండి. ఇక షార్ట్-టర్మ్ ఫండ్స్ విషయానికొస్తే, డీడబ్ల్యూఎస్ ఆల్ట్రా షార్ట్‌టర్మ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ ఇన్‌కమ్, సుందరమ్ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
ఫండ్స్ పనితీరు ప్రతి ఏడాదీ సమీక్షించాలి
Published Mon, Apr 21 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement