మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక రాబడులు కోరుకునే వారికి స్మాల్‌క్యాప్ పథకాలు అనుకూలం. దీర్ఘకాలం పాటు, అంటే కనీసం పదేళ్లు అంతకుమించిన లక్ష్యాలకు ఈ పథకాలు మంచి రాబడులను అందిస్తాయనడంలో సందేహం లేదు. అందుకు అందుబాటులోని గణాంకాలే నిదర్శనం. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇవి చిన్నవి కనుక ఆర్థిక సంక్షోభాలు, ఆయా రంగాల్లో వచ్చే ప్రతికూలతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
యాజమాన్యం సమర్థతలు చిన్న కంపెనీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆ తర్వాత అవి పనిచేసే రంగం, ఆయా రంగంలో కంపెనీ స్థానం ఇత్యాది ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది. సాధారణ ఇన్వెస్టర్లకు ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం కష్టమైన పని. అందుకుని చిన్న కంపెనీల కోసం ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను నమ్ముకోవడమే పెట్టుబడులకు అధిక రాబడితోపాటు తగినంత రక్షణిస్తుంది. స్మాల్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో టాటా స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి.
రాబడులు
2018 నవంబర్ 12న ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 30.65 శాతంగా ఉంది. ఏడాది కాల రాబడి చూస్తే 13 శాతంగా ఉంది. కానీ ఏడాది కాల రాబడి బీఎఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్‌లో 6 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్ పథకాల సగటు రాబడి చూసినా కానీ, 6 శాతమే ఉంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 రాబడి కూడా 4.50 శాతమే ఉంది.
ఫండ్ మేనేజర్ చంద్రప్రకాష్ పడియార్‌కు 21 ఏళ్ల అనుభవం ఉంటే, సహాయక ఫండ్ మేనేజర్ సతీష్ చంద్ర మిశ్రాకు సైతం 15 ఏళ్ల అనుభవం ఉంది. టాటా స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. రూ.4.8 లక్షల పెట్టుబడి కాస్తా, రాబడి కలుపుకుని రూ.8.39 లక్షలు అయి ఉండేది.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం అనే ప్రధాన ధ్యేయంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2,664 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 87.55 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. 0.54 శాతాన్ని రియల్ ఎస్టేట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టగా, మిగిలిన మేర నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.32 శాతమే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది.
లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 3.76 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీల్లో రూ.28.92 శాతం పెట్టబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 43 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 17 శాతం పెట్టుబడులు వీటికే కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13.60 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకంలో మొదటి సారి అయితే కనీసం రూ.5,000, సిప్ రూపంలో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
చదవండి ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిమిత ఆఫర్.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం!
Comments
Please login to add a commentAdd a comment