మార్కెట్ ట్రెండ్ కి గణాంకాలు,ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: బ్లూ చిప్ కంపెనీ లుపిన్, ఐటీసీ త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని పై విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రుతుపవనాల సెంటిమెంట్లు మార్కెట్లకు పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నా... వారంలో విడుదలయ్యే గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. 2016 ఏప్రిల్ నెలకు సంబంధించిన టోకుధరల ఇండెక్స్ సోమవారం విడుదల కానుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు.
మరోవైపు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా లుపిన్, ఐటీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఓ వైపు త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ఇండెక్స్ ఫలితాలు, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఈ వారం కూడా స్థిరంగా ఉండదని, ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముందని మోతిలాల్ ఓస్వల్ సెక్యురిటీస్ విశ్లేషకుడు రవి శెనోయ్ తెలిపారు.
త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల సంకేతాలు, అంతర్జాతీయ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను ఖరారు చేస్తాయని కొటక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూప్ రీసెర్చర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ దిపెన్ షా పేర్కొన్నారు. నత్తనడకన సాగిన పారిశ్రామిక ఉత్పత్తి డేటా, ఏప్రిల్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరగడం గతవారం మార్కెట్ ను కొంత ప్రభావితం చేశాయి. ఆఖరికి 261 పాయింట్లు పెరిగి, 25,489.57 వద్ద సెన్సెక్స్ ముగిసింది.