5 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ
♦ కొద్ది సంవత్సరాల్లోనే ఆ స్థాయికి చేరతాం
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే ఏడాది నుంచీ జీఎస్‌టీ
♦ అమలవుతుందని స్పష్టీకరణ
ఒసాకా: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లు (రెండు లక్షల కోట్ల డాలర్లు)గా ఉన్న ఆర్థిక వ్యవస్థ కొద్ది సంవత్సరాల్లోనే 5 ట్రిలియన్ డాలర్లకు (ఐదు లక్షల కోట్ల డాలర్లు) పరుగు పెడుతుందని అన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వచ్చే ఏడాది నుంచీ అమలవుతుందన్న ధీమాను సైతం ఆయన వ్యక్తం చేశారు. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా జపాన్‌లో జైట్లీ జరుపుతున్న ఆరు రోజుల పర్యటన గురువారం ఐదవరోజుకు చేరింది. ఒసాకాలో సీఐఐ, డీఐఐపీ నిర్వహించిన ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
♦ సంస్కరణల అమలుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందడానికి ఈ చర్యలు దోహదపడతాయి.
♦ ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... వృద్ధిలో భారత్ పురోగమిస్తోంది. వినియోగ వ్యయం, పట్టణ ప్రాంత డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ సైతం పటిష్టపడుతోంది. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా తగిన వర్షపాతం గ్రామీణాభివృద్దికి మరింతగా దోహదపడుతుంది.
♦ వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ గతంకన్నా ఇప్పుడు మరింత మెరగుపడింది. ప్రస్తుతం 189 దేశాల్లో 136వ స్థానంలో ఉన్న ర్యాంంక్ రానున్న కాలంలో మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలు అన్నింటినీ భారత్ తీసుకుంటోంది.
♦ భారత్ మౌలిక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి.
♦ గతం నుంచీ వర్తించే పన్ను నిబంధనలకు సంబంధించి రెట్రాస్పెక్టివ్ పన్ను అమలును పక్కనబెట్టడంసహా, ఇన్వెస్టర్లకు తగిన పన్ను సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది.
♦ నక్సలైట్ల తీవ్రవాదం వంటి సమస్యలు సైతం గతంలో ఉన్న తీవ్రంగా లేవు. ఆయా ఘటనలు ఇప్పుడు తగ్గాయి.