మైనింగ్ కుంభకోణంలో టింబ్లోపై విచారణ
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ఇప్పటికే గోవా మైనింగ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై టింబ్లోను ఈడీ విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.35,000 కోట్ల గోవా అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఈడీ నుంచి టింబ్లో, ఆ సంస్థ డెరైక్టర్లకు ఇప్పటికే సమన్లు జారీ అయినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
గడచిన కొన్ని సంవత్సరాలుగా సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అందజేయాలని టింబ్లో సంస్థను ఈడీ అడిగినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని కొన్ని నిబంధనల కింద సంస్థపై జూన్‌లో ఈడీ కేసు నమోదయినట్లు వారు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసు విచారణకు నియమించిన కమిషన్, విచారణ బోర్డుల నివేదికల నేపథ్యంలో ఈడీ విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన మైనింగ్ కుంభకోణంలో దాదాపు 80 సంస్థల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్‌లో ఉన్న ఈ కంపెనీలపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.35,000 కోట్లని 2012లో సమర్పించిన ఒక నివేదికలో షా కమిషన్ పేర్కొంది. ఈ కేసులో కంపెనీలతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులపై సైతం ఈడీ కేసులు నమోదయ్యాయి.