Mining scam
-
కర్ణాటక పాలిటిక్స్‌లో ట్విస్ట్.. ఇప్పుడు కుమారస్వామి వంతు!
బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్‌భవన్‌కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్‌ఎస్‌వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్‌ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్‌భవన్‌కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్‌షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్‌భవన్‌కు నివేదిక వెళ్లింది. అయితే.. గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్నిరాని, జీ జనార్ధన్రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే.. కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కామ్‌లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు
రాంఛీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్‌లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్ గానీ స్పందించలేదు. చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు.. -
బాబూ.. పోలీసుబలంతో ఎంతకాలం కవర్ చేసుకుంటావు!
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియంతృత్వ ధోరణిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురజాలలో సాగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, గురజాలలో సెక్షన్ 144 విధింపు వంటివి.. మైనింగ్ కుంభకోణంలో నిందితులు ఎవరో చెప్పకనే చెప్తున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. మీ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలపై నినదిస్తున్న గొంతుకలను అణచివేయడానికి ఎంతకాలం ఇలా క్రూరంగా పోలీసుబలాన్ని ప్రయోగిస్తారని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. గుంటూరులో ప్రభుత్వ దాష్టీకం! గుంటూరులోని అక్రమ క్వారీలపై వైఎస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగిలింది. ఎక్కడికక్కడ పార్టీ నేతలను అడ్డుకుంది. అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫాలను మంగళగిరి కాజ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దుగ్గిరాల పోలీసుస్టేషన్‌కు తరలివచ్చారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, నిజనిర్దారణలో భాగంగా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నడికుడి రైల్వేస్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా హంగామా సృష్టిస్తున్న పోలీసులు అడుగడుగునా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. The unlawful arrests of YSRCP leaders, who were part of the Fact-Finding Committee for Gurajala mining scam; and proclaiming Section 144 is enough to prove who is culpable. @ncbn for how long will you use the brutal police force to suppress voices and cover up your scams? — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 August 2018 -
మైనింగ్ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే..
-
మైనింగ్ కుంభకోణంలో టింబ్లోపై విచారణ
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ఇప్పటికే గోవా మైనింగ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై టింబ్లోను ఈడీ విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.35,000 కోట్ల గోవా అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఈడీ నుంచి టింబ్లో, ఆ సంస్థ డెరైక్టర్లకు ఇప్పటికే సమన్లు జారీ అయినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. గడచిన కొన్ని సంవత్సరాలుగా సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అందజేయాలని టింబ్లో సంస్థను ఈడీ అడిగినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని కొన్ని నిబంధనల కింద సంస్థపై జూన్‌లో ఈడీ కేసు నమోదయినట్లు వారు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసు విచారణకు నియమించిన కమిషన్, విచారణ బోర్డుల నివేదికల నేపథ్యంలో ఈడీ విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన మైనింగ్ కుంభకోణంలో దాదాపు 80 సంస్థల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లో ఉన్న ఈ కంపెనీలపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.35,000 కోట్లని 2012లో సమర్పించిన ఒక నివేదికలో షా కమిషన్ పేర్కొంది. ఈ కేసులో కంపెనీలతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులపై సైతం ఈడీ కేసులు నమోదయ్యాయి.