బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.
అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్‌భవన్‌కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.
2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్‌ఎస్‌వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్‌ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్‌భవన్‌కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్‌షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్‌భవన్‌కు నివేదిక వెళ్లింది. అయితే..
గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్‌నిరాని, జీ జనార్ధన్‌రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే..
కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు.
టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కామ్‌లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment