పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వేగంగా కదులుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలంటూ ఈడీ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో కోర్టు జారీచేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లను ఆధారం చేసుకుని ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీచేయాలని ఈడీ కోరుతున్నట్టు అధికారులు చెప్పారు. సీబీఐకి కూడా ఈడీ తన అభ్యర్థనను పంపింది.
క్రిమినల్ కేసు విచారణలో విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి వెనక్కి రప్పించడానికి ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేస్తుంటారు. ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి అరెస్ట్‌ను ఇంటర్‌పోల్ కోరవచ్చు. వారిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత దేశాలను వారిని కస్టడీలోకి తీసుకోమని ఆదేశించవచ్చు. ఈడీ అభ్యర్థన మేరకు ఈ నెల మొదట్లో ముంబై స్పెషల్ కోర్టు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీచేసింది. ఈడీ కూడా వీరిద్దరికీ సమన్లు పంపింది. అయితే విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే అవసరం ఉన్నందున తిరిగి దేశానికి రాలేమని వింతైన సమాధానమిచ్చారు. పీఎన్‌బీలో చోటు చేసుకున్న రూ.12,700 కోట్ల స్కాంలో వీరు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment