సాక్షి, న్యూఢిల్లీ : కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చుంటే.. నేనమ్మా తక్కువా అంటూ కోడి గుడ్డు ధరలు గుండె గుబేలుమనిపిస్తున్నాయి. ఏకంగా కోడి గుడ్డు ధరలు 40 శాతం మేర పెరిగాయి. నిన్న మొన్నటి దాకా రూ.4 ఉన్న కోడి గుడ్డు ధరలు, నేడు ఏకంగా రూ.7 నుంచి రూ.7.50గా పలుకుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమేనని, మరోవైపు జీఎస్టీ రేట్లు పెరగడంతో ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రమేష్ కాత్రి చెప్పారు. వచ్చే నెలల్లో కూడా కోడి గుడ్డు ధరలు మరింత పెరగనున్నట్టు పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి ఈ ఏడాదిలో 25-30 శాతం తగ్గిపోనుందని చెప్పారు. గతేడాది సరియైన రేట్లు లభించకపోవడంతో చాలా ఫౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని, దీంతో ఈ ఏడాది రేట్లు ఎగిశాయని తెలిపారు. 2016-17లో హోల్‌సేల్‌గా గుడ్డు ధరలు రూ.4 కంటే తక్కువగానే ఉండేవి.
గతేడాది రేట్లు తగ్గిపోవడంతో వచ్చిన నష్టాల మేరకు ఫౌల్ట్రీ సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించాయని కాత్రి వివరించారు. మరోవైపు కోడి గుడ్ల ధర పెరగడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు వాపోతున్నారు. అంతేకాక ఇటు పెరిగిన గుడ్ల ధరలకు వినియోగదారులు కూడా తట్టుకోలేకపోతున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు తెలిపారు. దేశ రాజధాని రిటైల్ మార్కెట్లలో కోడి గుడ్ల ధరలు ఒక్కోటి రూ.7 నుంచి రూ.7.50 మధ్యలో పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment